ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్‌ఆర్ రైతుభరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలో లబ్ధిదారులకు రైతుభరోసా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. నా పాదయాత్రలో రైతుల కష్టాలను చూశా. గత ఐదేళ్లలో లక్షల రైతు కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చూశామని అన్నారు.
2017 ప్లీనరీలోనే రైతుభరోసా అందిస్తామని హామీ ఇచ్చానని జగన్ అన్నారు. మేనిఫెస్టోలో కూడా తొలి వాగ్ధానంగా ప్రకటించా. ఇచ్చిన హామీకి ఇంకా మెరుగులు దిద్ది అమల్లోకి తీసుకొచ్చాం. చెప్పినదానికంటే అదనంగా ఐదేళ్లలో రూ.17,500 ఇస్తున్నాం. ప్రతి ఏటా 13,500 చొప్పున ఐదేళ్లు ఇస్తాం. మేలో 7,500, అక్టోబర్‌లో 4వేలు, సంక్రాంతికి 2వేలు అందజేస్తాం. రూ.2,164 కోట్లతో రైతుబీమాను ప్రభుత్వమే భరిస్తుందని జగన్ పేర్కొన్నాడు.