పాక్ సైన్యం లడఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖకు ఆవల క్షిపణులను మోహరించినట్టు వచ్చిన వార్తలపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. సరిహద్దుల వద్ద ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి భారత సైన్యం సర్వ సన్నద్ధంగా ఉందన్నారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి ప్రశాంతంగానే ఉందని చెప్పారు. సరిహద్దుల్లో పాక్ దుశ్చర్యలకు పాల్పడితే, సమర్థవంతంగా తిప్పికొడతామని చెప్పారు.
ముందు జాగ్రత్త చర్యలుగా సరిహద్దులకు మరింత సైన్యాన్ని చేర్చడం వెనుక వేరే ఉద్దేశమేమీ లేదని రావత్ చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటారని అన్నారు. 1970-80 ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ ఎంత ప్రశాంతంగా ఉండేదో, అదే ప్రశాంతత త్వరలోనే కనిపిస్తుందన్న నమ్మకం ఉందని బిపిన్ రావత్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సైనికులు ఎటువంటి ఆయుధాలనూ తీసుకెళ్లకుండా ప్రజల్లోకి వెళ్లి వారికి బక్రీద్ శుభాకాంక్షలు చెప్పి వచ్చారని తెలిపారు.