‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ భామ ఆ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది.
ప్రస్తుతం కృతి శెట్టి రామ్‌తో నటించిన ‘ది వారియర్’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే కాకుండా సుధీర్ బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నితిన్ సరసన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలు చేస్తోంది.
తాజాగా తమిళనాట కృతి ఓ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆమెకు ‘ఉత్తమ నటి’గా అవార్డు దక్కింది. అవార్డు తీసుకున్న అనంతరం ఆమె ఓ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఇద్దరు యాంకర్స్ పాల్గొనగా.. అందులో ఒకరు మాత్రమే కృతిని వరుసగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ యాంకర్ అడిగిన ప్రశ్నలకు కృతి నవ్వుతూ సమాధానాలు చెబుతుండగా.. పక్కనే ఉన్న మరో యాంకర్.. “ప్రశ్నలన్నీ నువ్వే అడిగితే.. ఇక నేను ఎందుకిక్కడ? ఈ ఇంటర్వ్యూలో నన్నెందుకు కూర్చొపెట్టారు? ఈ మాత్రం దానికి ఇంత ఖరీదైన దుస్తులు ఎందుకు? ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎవరు? కెమెరా ఆఫ్ చేయండి” అంటూ కేకలు వేశాడు.
దాంతో ఇద్దరు యాంకర్స్ ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ కృతిశెట్టి ఎదుటే గొడవకు దిగారు. అంతేకాకుండా ఒక యాంకర్ మరో యాంకర్‌ను కొట్టాడు. దీంతో ఏం జరుగుతుందో తెలియని బేబమ్మ భయపడిపోయింది.
అయితే ఆ తర్వాత అది ప్రాంక్ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకుని నవ్వింది కృతిశెట్టి. పైకి నవ్వినా ఆపై దుఃఖం ఆపుకోలేక లైవ్‌లోనే ఏడ్చేసింది. కొద్దిసేపు తర్వాత ఆమెకు సర్దిచెప్పిన యాంకర్లు.. ఎందుకు ఏడ్చారు, ఏమైంది అని ప్రశ్నించారు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ఆ ఇద్దరు యాంకర్స్‌పై విరుచుకుపడుతున్నారు. ఇదేం ప్రాంక్ అంటూ మండిపడుతున్నారు.