telugu navyamedia
క్రీడలు వార్తలు

డబ్ల్యూటీసీ కామెంటేటర్‌గా ప్రశంసలు అందుకుంటున్న కార్తీక్

డబ్ల్యూటీసీ ఫైనల్ లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న పోరులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. 88 పరుగులకే ప్రధాన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఆదుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు భారత దిగ్గజం సునీల్ గవాస్కర్‌తో పాటు టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ట్విటర్ వేదికగా ఈరోజు ఉదయం నుంచి మ్యాచ్ అప్‌డేట్స్, సౌథాంప్టన్‌ వాతావరణ పరిస్థితులను కార్తీక్ అభిమానులకు తెలియజేశాడు. ఇక మ్యాచ్ ప్రారంభమైన తర్వాత తనదైన వ్యాఖ్యానంతో అభిమానులను అలరించాడు. తనదైన సమయస్పూర్తితో సహచర కామెంటేటర్లపై పంచ్‌లు వేస్తూ.. చలోక్తులు పేల్చుతూ దూసుకుపోతున్నాడు. వ్యాఖ్యానం చేయడం ఇదే మొదటిసారి అయినా.. ఎక్కడా తబడలేదు. దినేశ్ కార్తీక్ కామెంట్రీ పట్ల ఫాన్స్ ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అతడి వ్యాఖ్యానంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కార్తీక్ కామెంటేటర్‌గా దుమ్మురేపుతున్నాడని ఓ అభిమాని కామెంట్ చేయగా.. భారత తరఫున దినేశ్ కార్తీక్ కామెంటరీ బాక్స్‌లో ఆకట్టుకుంటున్నాడని మరో అభిమాని ట్వీట్ చేశాడు.

Related posts