telugu navyamedia
క్రీడలు వార్తలు

అలా అయితేనే రోహిత్ ఆసీస్ వెళ్తాడు; దాదా

hitman rohit duck out

పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధిస్తేనే ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ వెళ్తాడని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. కరోనా బ్రేక్‌‌ తర్వాత టీమిండియా ఆడే తొలి అంతర్జాతీయ సిరీస్‌‌ అయిన ఈ పర్యటనకు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను పక్కనపెట్టిన విషయం తెలిసిందే. రెండు నెలల పాటు సాగే ఈ లాంగ్ టూర్‌కు తొడకండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న హిట్ మ్యాన్‌ను ఒక్క ఫార్మాట్‌‌కు కూడా ఎంపిక చేయలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్‌లో రోహిత్ గాయపడ్డాడు. అప్పటి నుంచి బెంచ్‌కే పరిమితమైన హిట్‌మ్యాన్.. ఆసీస్ ‌టూర్‌కు కూడా ఎంపికవ్వలేదు. అయితే ఈ సుదీర్ఘ పర్యటనకు రోహిత్‌ను ఎంపికచేయకపోవడంపై తీవ్ర దుమారం రేగింది.

ఈ క్రమంలో ఆసీస్ పర్యటనకు రోహిత్ అందుబాటులో ఉండే విషయాంపై దాదా స్పందించాడు. రోహిత్ శర్మతో పాటు గాయపడ్డ ఇషాంత్ శర్మలు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధిస్తే ఆస్ట్రేలియాకు పంపిస్తామని తెలిపాడు. ‘ఇషాంత్, రోహిత్ గాయాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాం. ఇషాంత్ టెస్ట్ సిరీస్‌లో భాగమయ్యే అవకాశం ఉంది. ఇక రోహిత్‌కు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ అవసరమని మేం భావిస్తున్నాం. అతను తన ఫిట్‌నెస్ అందుకుంటే సెలెక్టర్లు పునరాలోచన చేస్తారు.’అని దాదా స్పష్టం చేశాడు. ఇక ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఓడించడం సులువైన విషయం కాదని ఈ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. పైగా డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, లబుషేన్ వంటి స్థార్ ఆటగాళ్లతో ఆ జట్టు చాలా బలంగా ఉందన్నాడు. అయితే వారిని ఎదుర్కొనే సత్తా భారత ఆటగాళ్లకు ఉందని తెలిపాడు. ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీసే పేసర్లు భారత జట్టులో ఉన్నారని చెప్పాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవ్‌దీప్ సైనీలతో పేస్ అటాక్ బలంగా ఉందన్నాడు.

‘సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఆడటం ఎప్పుడూ కష్టమే. స్మిత్, వార్నర్ రాకతో ఆ జట్టు మరింత బలంగా తయారైంది. పైగా లబుషేన్ వంటి నిలకడగా రాణించే ఆటగాళ్లున్నారు. ఇది భారత్‌కు కఠిన సవాలే. అయితే వారిని ఓడించే సత్తా మనోళ్లకు ఉంది. ఇది ఓ మంచి సిరీస్‌గా ఉండబోతుంది. ఇరు జట్లు 50-50 చాన్సెస్ ఉన్నాయి. పరుగులు చేయడమే ముఖ్యం. ఎవరు ఎక్కువ రన్స్ చేస్తే వారే సిరీస్ గెలుస్తారు.’అని గంగూలీ తెలిపాడు.

Related posts