తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హరీష్ రావు హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించి తొలిసారిగా సమావేశానికి హాజరైన హరీష్ రావుకు జగ్గారెడ్డి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరారు. అనంతరం సభలో హరీష్ రావు మాట్లాడుతూ సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.
ఆర్థిక మాంద్యం వలన ఇతర ఖర్చులు, కేటాయింపులు తగ్గించామన్నారు. కానీ సంక్షేమ కార్యక్రమాలను మాత్రం యధావిధిగా కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. దేశం మొత్తం ఆర్థిక మాంద్యం ఉందని, కేంద్ర ప్రభుత్వం రోజుకోక దాంట్లో కోతలు పెడుతుందని విమర్శించారు. కానీ కేసీఆర్ మాత్రం సంక్షేమ పథకాల విషయంలో మాంద్యాన్ని లెక్క చేయలేదని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో రైతు బీమా పొందిన రైతులు ఏ విధంగా చనిపోయారో సవివివరంగా నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ కు ఉన్నంత ఓటు బ్యాంకు కూడా బీజేపీకి లేదు: తలసాని