telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దాసరి ఎవరు నీకు సరి ?

Dr Dasari

తెలుగు సినిమా రంగంలో దాసరి నారాయణ రావు గారిది ఓ స్వర్ణ యుగం. ఆయనలాంటి నిర్మాత, దర్శకుడు, రచయిత, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. సినిమాకు సంబంధించి అన్ని శాఖల్లో ప్రావీణ్యం వున్న ప్రతిభా శాలి, ప్రయోగశీలి. ఒకేసారి రెండు మూడు షూటింగ్లు చేసిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణ రావు.
ఆయనతో నాకు జర్నలిస్టుగా ఎన్నో మధురమైన అనుభవాలు వున్నాయి. అందులో ఒక దాన్ని గురించి వివరిస్తాను.
ఇది 39 సంవత్సరాల నాటి సంగతి. దాసరి నారాయణ రావు గారి కేరాఫ్ అడ్రస్ అన్నపూర్ణ స్టూడియోస్ అనేవారు. అది నిజం కూడా. ఆయన సినిమా షూటింగ్ లన్నీ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరిగేవి. ఆయన హైదరాబాద్ వస్తే నాంపల్లి నుంచి అబిడ్స్ వెళ్లే దారిలో వున్న అన్నపూర్ణ హోటల్లో ఉండేవారు. అయితే ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఉండేవారు.
అన్నపూర్ణ స్టూడియోస్ లో జితేంద్ర, వినోద్ మెహ్రా, వహీదా రెహ్మాన్, మౌషమీ ఛటర్జీ, సారిక నటించిన “జ్యోతి బనే జ్వాల” హిందీ చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకు దర్శకుడు దాసరి నారాయణరావు గారు.
అప్పట్లో దక్షిణాది నిర్మాతలు, దర్శకులకు అందుబాటులో వున్న ఏకైక హిందీ హీరో జితేంద్ర. జితేంద్రతో దాసరి నారాయణరావు గారు రూపొందించిన సినిమా “జ్యోతి బనే జ్వాల”. దాసరి నారాయణ రావు గారు జర్నలిస్టులను చాలా ఆత్మీయంగా చూసేవారు. ఆయన చిత్రం షూటింగ్ కవరేజ్ కు వెడితే ఒక పట్టాన వదిలిపెట్టేవారు కాదు. ముఖ్యంగా జ్యోతి చిత్ర సినిమా వార పత్రికలో ఆయన వార్తలకు, షూటింగ్ కవరేజ్, ఇంటర్వ్యూ లకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం.
ఉదయం 11 గంటలకు ఆయన సెట్లోకి వెడితే భోజనం చేసిన తరువాత 2 గంటలకు మాత్రమే వదిలిపెట్టేవారు.

Jyothi bane
ఆరోజు నేను అన్నపురం స్టూడియోస్ కు వెళ్ళాను. ఒక ఫ్లోర్ లో “జ్యోతి బనే జ్వాల” చిత్రం షూటింగ్ జరుగుతోంది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన “కటకటాల రుద్రయ్య” సినిమాకు ఇది రీమేక్.
సెట్లో దాసరిగారు, జితేంద్ర తీరిగ్గా కూర్చున్నారు. ఈ చిత్రానికి కెమెరా మెన్ కన్నప్ప. ఆయన లైటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాడు.
షాట్ రెడీ అయ్యేంత వరకు టైం ఉండటంతో జితేంద్ర, దాసరి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నేను ప్రవేశించాను. దాసరి నన్ను చూసి నవ్వుతూ ఆహ్వానించారు. జితేంద్రకు నన్ను పరిచయం చేశారు. మాటల మధ్యలో నేను జితేంద్రను ఇంటర్వ్యూ చేస్తాను… అంటూ దాసరి నారాయణ రావు గారు నాకు, జితేంద్ర మధ్యకు వచ్చి కూర్చున్నారు.
ఈ ఇంటర్వ్యూలో దాసరి అనేకరకమైన ప్రశ్నలు అడిగారు. అందులో దక్షిణ భారత నిర్మాతలు, దర్శకులు నిర్మించే సినిమాలకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు ? “దక్షిణ భారతంలో క్రమశిక్షణ ఎక్కువ , షూటింగ్ ఉదయం 7.00 గంటలకు అంటే తప్పకుండా మొదలవుతుంది. కానీ బొంబాయిలో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ సినిమా ప్రారంభమైన రోజునే విడుదల తేదీని కూడా ప్రకటిస్తారు” అని జితేంద్ర చెప్పాడు.
దర్శకుడు దాసరి నారాయణ రావు గురించి నీ అభిప్రాయం ?
“దాసరి నారాయణరావు గారు ఎంతో ప్రతిభ వున్న దర్శకుడు. సెట్లో అప్పటికప్పుడు డైలాగ్స్ రాయగల సమర్ధుడు. సినిమాను ఆసక్తికరంగా రూపొందించడంలో దిట్ట. అంటే కాదు ప్రేక్షకులకు ఎం కావాలో దాసరికి తెలుసు. అందుకే దాసరి అనగానే ఇంకేం ఆలోచించకుండా సినిమా చెయ్యడానికి రెడీ అనేస్తాను” అని చెప్పారు.
బొంబాయి వదిలి హైదరాబాద్ రావాలంటే ఎలా వుంది ?
“చాలా హ్యాపీగా వుంది. హోమ్ సిక్ అనేది లేదు. ఇక్కడి ఆహరం, వాతావరం అంటే ఎంతో ఇష్టం” చెప్పారు జితేంద్ర.
జ్యోతి చిత్ర తరుపున జితేంద్రను దాసరి నారాయణరావు గారు ప్రశ్నలు అడుగుతుంటే నేను వ్రాసుకుంటున్నాను. నిజంగా అవి చాలా మధురమైన రోజులు. “జ్యోతి బనే జ్వాల” సినిమాతో అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఒక ఫ్లోర్ ను అక్కినేని నాగేశ్వర రావు చిరకాల స్నేహితుడు అశోక్ కుమార్ ప్రారంభించడం విశేషం . జ్యోతి బనే జ్యాల చిత్రంలో అశోక్ కుమార్ కూడా నటించారు .
తెలుగు సినిమా రంగంలో దాసరి నారాయణ రావు గారు లేని లోటు ఇప్పుడు అందరికీ తెలిసి వస్తుంది.

-భగీరథ

Related posts