ఒక కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు. ఓర్పుతో, నేర్పుతో మట్టి ముద్దలను కుండల ఆకృతిలో మలిచాడు. వాటిని కాల్చడానికి ఏర్పాట్లు చేశాడు. అప్పటికే కాలుతున్న కొన్ని కుండలని చూసి పచ్చి కుండల్లో ఒకదానికి చాలా భయం వేసింది. ‘అమ్మో! ఒళ్లు కాలిపోవడమే? వద్దు. దయచేసి నన్ను కాల్చొద్దు. నన్నిలా వదిలెయ్. సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టకు. నాకు భయంగా ఉంది’ అని కుమ్మరిని దీనంగా బతిమాలింది. కుమ్మరి కుండతో ‘జీవితంలో తొలిదశలో కష్టపడితే తర్వాత జీవితాంతం హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు కష్టమని భావించి సోమరిగా ఇలా ఉండిపోతే నీ జీవితం వృథా అవుతుంది. సమాజానికీ ఉపయోగపడక వ్యర్థమైపోతావు’ అంటూ ఎన్నో విధాల నచ్చచెప్పాడు. అతడు ఎంత చెప్పినా వినకుండా కుండ మొండికేసింది. సరే… అంతలా అడుగుతోంది పోనిమ్మని కుమ్మరి ఈ కుండని వదిలేసి మిగిలిన కుండలను ఆవంలో పెట్టాడు. ఆవంలో కాలుతున్న కుండలని చూస్తూ తనకి ఆ అవస్థ తప్పినందుకు, ఆనంద పడుతూ, ‘నాకా బాధలు లేవు, హాయిగా ఉన్నాను’ అనుకుంది ఆ పచ్చి కుండ. బాగా కాలిన ఎర్రని, నల్లని కుండలన్నీ అమ్ముడుపోయాయి. ఎవరూ కొనేవారు లేక పచ్చి కుండ మాత్రం ఆరుబయట ఆవరణలో అలా ఉండిపోయింది. కుమ్మరి ఒక కుండలో నీళ్లు నింపాడు. కొన్ని కుండీలలో మట్టి నింపి మొక్కలు నాటాడు. తనకా బరువులు లేనందుకు ఆనందించిందా పచ్చి కుండ. ఇలా ఉండగా ఓ రోజు కుండపోతగా వర్షం కురిసింది. కాల్చిన కుండలూ, కుండీలూ దృఢంగా అలాగే ఉంటే ఈ పచ్చికుండ మాత్రం మెల్లిగా కరిగి మట్టిలో కలిసిపోసాగింది. తన ఆకృతిని, ఉనికిని కోల్పోయింది. కుమ్మరి మాటల్లో అంతరార్థం దానికి చివరిక్షణంలో బోధపడింది. కానీ అప్పటికే జీవితం చేజారిపోయింది