telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ : ఢిల్లీ ఖాతాలో మరో విజయం .. మళ్ళీ కలిసిరాని.. రహానే శతకం..

రాజస్థాన్‌ మరోసారి అజింక్య రహానె (105 నాటౌట్‌; 63 బంతుల్లో 11×4, 3×6) సెంచరీ చేసినా.. గెలవలేకపోయింది. రాత్రి జరిగిన మ్యాచ్‌లో దిల్లీ 6 వికెట్ల తేడాతో రాయల్స్‌ను ఓడించింది. మొదట రాజస్థాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఛేదనలో రిషబ్‌ పంత్‌ (78 నాటౌట్‌; 36 బంతుల్లో 6×4, 4×6), శిఖర్‌ ధావన్‌ (54; 27 బంతుల్లో 8×4, 2×6) మెరవడంతో లక్ష్యాన్ని దిల్లీ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

శిఖర్‌ ధావన్‌ రాజస్థాన్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగి చెలరేగిపోయాడు. ధవళ్‌ కులకర్ణి వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో సిక్స్‌తో మొదలుపెట్టిన ధావన్‌.. ఆ తర్వాత గోపాల్‌ బౌలింగ్‌లో సిక్స్‌, రెండు ఫోర్లతో సహా 15 పరుగులు రాబట్టాడు. ధవళ్‌ బౌలింగ్‌లో మరోసారి మూడు ఫోర్లు కొట్టిన శిఖర్‌.. పరాగ్‌ బౌలింగ్‌లో సింగిల్‌తో అర్ధసెంచరీ (25 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. దూకుడు మీదున్న ధావన్‌ను శ్రేయస్‌ గోపాల్‌ (2/47) ఔట్‌ చేశాడు. పృథ్వీ షా (42; 39 బంతుల్లో 4×4, 1×6)తో కలిసి శిఖర్‌ తొలి వికెట్‌కు 72 పరుగులు జత చేశాడు. కాసేపటికే కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (4) కూడా ఔట్‌ కావడంతో దిల్లీ 77/2తో ఇబ్బందుల్లో పడింది. 60 బంతుల్లో 111 పరుగులు చేయాల్సిన స్థితి! ఈ దశలో రిషబ్‌ పంత్‌ దూకుడుగా ఆడాడు. ముఖ్యంగా తన శైలిలో పుల్‌ షాట్లతో మెరిసిన పంత్‌.. దిల్లీ సాధించాల్సిన రన్‌రేట్‌ను అదుపులో ఉంచాడు. 24 బంతుల్లో 41 పరుగులు అవసరమైన స్థితిలో పృథ్వీని గోపాల్‌ ఔట్‌ చేశాడు. 7 బంతుల్లో 12 పరుగులు చేయాల్సినపుడు సిక్స్‌ బాది దిల్లీని విజయానికి చేరువ చేసిన పంత్‌.. ఆ తర్వాతి ఓవర్లో మరో సిక్స్‌ కొట్టి దిల్లీని గెలిపించాడు.

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో రహానె ఆటే హైలైట్‌. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే శాంసన్‌ (0) వికెట్‌ కోల్పోయినా.. రహానె.. స్టీవ్‌ స్మిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. స్మిత్‌ ఆచితూచి ఆడగా.. రహానె మాత్రం బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. అక్షర్‌ బౌలింగ్‌లో వరుసగా సిక్స్‌, ఫోర్‌ బాదిన అజింక్య.. రబాడకూ ఇదే శిక్ష వేశాడు. 32 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన రహానె.. మరో 26 బంతుల్లోనే సెంచరీ మైలురాయి అందుకున్నాడు. అతనికిది రెండో ఐపీఎల్‌ శతకం. రహానెతో పాటు స్మిత్‌ కూడా జోరు పెంచడంతో ఒక దశలో రాయల్స్‌… 12 ఓవర్లకు 122/1తో సులభంగా 200 పరుగులు దాటేలా కనిపించింది. కానీ స్మిత్‌ను ఔట్‌ చేసిన అక్షర్‌.. ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. రెండో వికెట్‌కు రహానె-స్మిత్‌ 130 పరుగులు జత చేయడం విశేషం. అయితే స్మిత్‌ ఔటైన తర్వాత రాజస్థాన్‌ రన్‌రేట్‌ తగ్గింది. దీనికి తోడు స్టోక్స్‌ (8), టర్నర్‌ (0) వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేరడంతో రాయల్స్‌ వేగంగా పరుగులు సాధించలేకపోయింది. ఒకవైపు రహానె క్రీజులో ఉన్నా.. పరుగులు అంత సులభంగా రాలేదు. 19, 20 ఓవర్లలో రాయల్స్‌కు ఎనిమిదేసి పరుగులు మాత్రమే లభించాయి. దిల్లీ బౌలర్లలో రబాడ (2/37) రాణించాడు.

delhi won on rajastan in ipl 2019 matchనేటి మ్యాచ్ : చెన్నై vs హైదరాబాద్ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది.

Related posts