telugu navyamedia
క్రీడలు వార్తలు

నేను ధోనీ పాత్రలో ఒదిగిపోయేందుకు ప్రయత్నిస్తున్నా : రాహుల్

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరని యువ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. అయితే ధోనీ పాత్రలో ఒదిగిపోయేందుకు ప్రయత్నిస్తానన్నాడు. తన అవగాహన మేరకు మైదానంలో స్పిన్నర్లకు సలహాలు ఇస్తానని పేర్కొన్నాడు. ఆసీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్లో రాహులే కీపింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.’ఎంఎస్‌ ధోనీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు. ఒక వికెట్‌ కీపర్ కమ్‌ బ్యాట్స్‌మన్‌ ఎలా ఉండాలో మహీ మనందరికీ చూపించాడు. అతడి నుంచే మనమెంతో నేర్చుకున్నాం. కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, రవీంద్ర జడేజాతో నాకు మంచి అవగాహన ఉంది. ఏది మంచి లెంగ్తో, ఎక్కడ బంతులు వేయాలో, ఫీల్డర్లను ఎక్కడ మోహరించాలో నా సామర్థ్యం మేరకు వాళ్లకు సూచనలు చేస్తుంటాను. గ్లోవ్స్‌ ధరించిన ప్రతి ఒక్కరికీ ఆ బాధ్యత ఉంటుంది’ అని కేఎల్ రాహుల్‌ అన్నాడు. టీమిండియా తరఫున వికెట్‌ కీపింగ్‌ను తాను ఆస్వాదిస్తున్నానని, చాలా బాగుందని కేఎల్ రాహుల్‌ తెలిపాడు. గతంలో న్యూజిలాండ్‌లో గ్లోవ్స్‌ ధరించానన్నాడు. సారథి, బౌలర్లకు తన అభిప్రాయాలు చెప్పానన్నాడు. ‘న్యూజిలాండ్‌ పర్యటనలో నేను గ్లోవ్స్‌ ధరించాను. కీపింగ్‌ను ఆస్వాదించాను. వికెట్ల వెనకాల ఉంటూ మ్యాచ్‌ను అర్థం చేసుకొని కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్లకు సలహాలు ఇచ్చాను’ అని రాహుల్‌ తెలిపాడు.

Related posts