కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ వాయిదా పడటంతో ఆర్థికంగా రూ. వేల కోట్లు నష్టపోయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. క్రికెటర్ల జీతాల్ని మాత్రం పూర్తిగా చెల్లించేసింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆటగాళ్లని ఇబ్బంది పెట్టకూడదని మొత్తం జీతాల్ని చెల్లించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ‘‘కేంద్ర ప్రభుత్వం మార్చి 24న దేశంలో లాక్‌డౌన్ ప్రకటించే నాటికే బీసీసీఐ అన్నింటికీ సిద్ధమైంది. ఇప్పటికే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాళ్ల చెల్లింపులన్నీ పూర్తయ్యాయి. అలానే మార్చి 31 వరకూ టీమిండియా, భారత్-ఎ జట్టుకి మ్యాచ్‌లాడిన క్రికెటర్ల మ్యాచ్ ఫీజుల్ని కూడా చెల్లించేశాం’’ అని బీసీసీఐ అధికారి తెలిపాడు. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డుగా బీసీసీఐ ఉన్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకావాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ 15కి వాయిదాపడింది. అయితే.. దేశంలో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఇప్పుడు టోర్నీ జరగడంపైనా సందిగ్ధత నెలకొంది. ఒకవేళ ఐపీఎల్ 2020 రద్దయితే బీసీసీఐ సుమారు రూ. 2 వేల కోట్లు నష్టపోనుందని ఓ అంచనా. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ సిరీస్‌లన్నీ రద్దవడంతో కొన్ని క్రికెట్ దేశాల బోర్డులు ఆటగాళ్ల జీతాల్లో కోత పెట్టాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఇప్పటికే ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆటగాళ్లతో చర్చలు జరపగా.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకటనని తాత్కాలికంగా వాయిదా వేసింది. దీంతో.. టీమిండియా ఆటగాళ్ల జీతాల్లోనూ కోత పడనుందని వార్తలు వచ్చాయి.
next post
ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి: విజయసాయిరెడ్డి