telugu navyamedia
క్రీడలు వార్తలు

హైదరాబాద్‌‌ కు కాకుండా ఆంధ్రాకు ఆడనున్న రాయుడు…

ambati rayudu best performance in hajare trophyambati rayudu best performance in hajare trophy

పరిపాలన వైఫల్యంతో పాతాళానికి దిగజారిన హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ (హెచ్‌‌సీఏ)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మహమ్మద్‌‌ అజారుద్దీన్‌‌ సారథ్యంలోని హెచ్‌‌సీఏ చెత్త రాజీకీయాలతో విసిగిన టీమిండియా స్టార్ ప్లేయర్ అంబటి రాయుడు హైదరాబాద్‌‌ జట్టుకు గుడ్‌బై చెప్పాడు. అతను మరోసారి పక్క రాష్ట్రం ఆంధ్రకు బదిలీ‌ అయ్యాడు. కొత్త సీజన్‌‌లో రాయుడు ఆంధ్ర జట్టు‌కు ఆడతాడని, ఈ మేరకు అతనికి నిరభ్యంతర పత్రం(ఎన్‌‌వోసీ) ఇచ్చినట్టు హెచ్‌‌సీఏ సెక్రటరీ విజయానంద్‌‌ ధ్రువీకరించారు. దాంతో, జనవరి 10వ తేదీ నుంచి జరిగే సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ టోర్నమెంట్‌‌లో ఆంధ్ర టీమ్‌‌ సెలెక్షన్‌‌కు అంబటి అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో ఆంధ్ర క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ నుంచి కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 35 ఏళ్ల రాయుడు హెచ్‌‌సీఏను వీడి ఆంధ్రకు ఆడడం ఇది రెండోసారి. 2005-06 సీజన్‌‌లో అతను ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత బరోడా, విదర్భ జట్లకు ఆడిన రాయుడు.. 2017-18 సీజన్‌‌లో తిరిగి హైదరాబాద్‌‌ జట్టు‌లో చేరాడు. ఇక, సీనియర్​ పేసర్​ ఎమ్ రవికిరణ్​ కూడా స్టేట్​ టీమ్​ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ సీజన్​లో అతను ఛత్తీస్​గడ్​కు ఆడాలని నిర్ణయించుకున్నాడని ప్రచారం జరుగుతుంది. 29 ఏళ్ల రవికిరణ్​.. 46 ఫస్ట్​ క్లాస్​ మ్యాచ్​ల్లో 149 వికెట్లు తీశాడు. ఇప్పటికే చెత్త ఆటతో దారుణంగా విఫలమవుతున్న హైదరాబాద్‌కు రాయుడు, రవికిరణ్ దూరమైతే ఈ సీజన్​లో రాణించడం కష్టమే.

హెచ్‌సీఏలోని రాజకీయాలతో విసుగు చెందే రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. పైగా ప్రెసిడెంట్‌‌ అజారుద్దీన్‌‌ తన పట్ల వ్యవహరించిన తీరుతో కూడా అంబటి నొచ్చుకున్నాడని అతని సన్నిహి త వర్గాలు పేర్కొన్నాయి. రిటైర్మెంట్‌‌ను పక్కనబెట్టి మరీ రాయుడు గత సీజన్‌‌లో విజయ్‌‌ హజారే, ముస్తాక్‌‌ అలీ టీ20 టోర్నీల్లో హైదరాబాద్‌‌కు కెప్టెన్‌‌గా వ్యవహరించాడు. ఆ రెండు టోర్నీల్లో జట్టు ఓ మోస్తరుగా ఆడింది. అనంతరం హెచ్‌‌సీఏలో అవినీతితో టీమ్‌‌లో చాలా పాలిటిక్స్‌‌ జరుగుతున్నాయని, డబ్బు, పలుకుబడి ఉన్న వాళ్లనే సెలెక్ట్‌‌ చేస్తున్నారన్న విషయాలను బయటపెట్టాడు. అర్జున్‌‌ యాదవ్‌‌కు సీనియర్‌‌ టీమ్‌‌ కోచ్‌‌గా కొనసాగే అర్హతే లేదన్నాడు. పరిస్థితి ఇలానే ఉంటే టీమ్‌‌కు, ప్లేయర్లకే చాలా నష్టం అన్నాడు. ఈ విషయాలను అజార్‌‌కు చెప్పినా పట్టించుకోకపోవడంతో రాయుడు రంజీలకు దూరంగా ఉన్నాడు. అంబటి ఊహించినట్టే ఆ ట్రోఫీలో హైదరాబాద్‌‌ దారుణంగా ఆడింది. అయితే, రాయుడు బయటపెట్టిన సమస్యలు పరిష్కరించని అజార్‌‌ తిరిగి అతనిపైనే ఎదురుదాడి చేశాడు. అప్పటి నుంచి అజర్‌‌, రాయుడికి అస్సలు పడడం లేదని హెచ్‌‌సీఏ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ ట్రోఫీలో అంబటిని కెప్టెన్‌‌గా కొనసాగించేందుకు కూడా అజర్‌‌ సుముఖంగా లేడని తెలుస్తోంది. అతను స్టేట్‌‌ టీమ్‌‌లో ఉండడం అజార్‌‌కు ఇష్టం లేదని హెచ్‌‌సీఏ అధికారి ఒకరు చెప్పారు. వాస్తవానికి గత రంజీ సీజన్‌‌లోనే రాయుడు హైదరాబాద్‌‌ను వీడాలని భావించాడని, తాము నచ్చజెప్పడంతో ఇప్పటిదాకా ఉన్నాడని తెలిపారు.

ఆటగాడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న అజార్‌‌ పాలనలో హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ ఖ్యాతి మసకబారుతోంది. దాంతో, టాలెంటెడ్‌‌ ప్లేయర్లు హైదరాబాద్‌‌ను వదిలేస్తున్నారు. ఇతర రాష్ట్రాల జట్లకు వలసపోతున్నారు. ఈ సీజన్‌‌ ఐపీఎల్‌‌లో సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ టీమ్‌‌కు ఎంపికైన ఆల్‌‌రౌండర్‌‌ బావనక సందీప్‌‌.. సెప్టెంబర్‌‌లో గోవాకు ట్రాన్స్‌‌ఫర్‌‌ అయ్యాడు. ఎంతో ప్రతిభ ఉన్న అతని పట్ల సీనియర్‌‌ కోచ్‌‌, సెలెక్టర్లు కఠినంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. హెచ్‌‌సీఏ పెద్దల లాబీయింగ్‌‌కు తలొగ్గి టాలెంట్‌‌, ఎక్స్‌‌పీరియన్స్‌‌ రెండూ ఉన్నా కూడా అతనికి తుది జట్టులో చోటు ప్రశ్నార్థకం చేశారు. దాంతో, స్టేట్‌‌ టీమ్‌‌కు కెప్టెన్‌‌ కాగలడని భావించిన 28 ఏళ్ల సందీప్‌‌.. హైదరాబాద్‌‌కు గుడ్‌‌బై చెప్పాల్సి వచ్చింది. అంతకుముందే హనుమ విహారి ఆంధ్ర టీమ్‌‌కు ట్రాన్స్‌‌ఫర్‌‌ అవ్వగా, ఇంకో సీనియర్‌‌ ఆటగాడు డీబీ రవితేజ కూడా హైదరాబాద్‌‌ను వీడాడు. ఇప్పుడు రాయుడు లాంటి ప్లేయర్‌‌ను మరోసారి వదులుకోవాల్సి రావడం, రవికిరణ్​ కూడా దూరం అవడంహెచ్‌‌సీఏకు ఇబ్బందికర విషయమే.

Related posts