కరోనా వైరస్ భారీనపడి రోజూ వందలాది మంది మృత్యువాత పడుతున్న నేపథ్యంలో మే మూడో తేదీ వరకూ లాక్‌డౌన్‌ను కొనసాగిస్తామని ఇటలీ ప్రధాని గియుసేప్ కాంటే ప్రకటించారు. ఈ విషయంలో వ్యాపార వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చినప్పటికీ ఆయన తలొగ్గలేదు. కరోనా కట్టడి కోసం దేశంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్ ఈ నెల 13వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే శుక్రవారం మరో 570 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించిన తర్వాత కాంటే లాక్‌డౌన్‌పై నిర్ణయం ప్రకటించారు. ఇటలీలో దాదాపు లక్షన్నర మందికి కరోనా సోకగా.. ఇప్పటికే 18,500 పైచిలుకు మరణాలు సంభవించాయి.
అంతకుముందు లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని ఇటలీ పారిశ్రామిక రంగంలో 45 శాతం ఉత్పత్తి చేసే బిజినెస్ యూనియన్లు.. కాంటేపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. ఆంక్షలు ఇలానే కొనసాగితే కార్మికులకు జీతాలు ఇవ్వలేమని ప్రధానికి లేఖ రాశాయి. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ వైరస్ వ్యాప్తికి మరోసారి అవకాశం ఇవ్వకూడదని కాంటే స్పష్టం చేశారు. అందుకే మరో మూడు వారాలు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నానని చెప్పారు.