telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

గురువుకు నివాళులు అర్పించిన.. సచిన్ టెండూల్కర్ …

sachin tendulkar condolence to achrekar

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన గురువు రమాకాంత్‌ ఆచ్రేకర్‌ తొలి వర్ధంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించాడు. మీరు ఎల్లప్పుడూ మా గుండెల్లోనే ఉంటారు ఆచ్రేకర్‌ సర్‌.. అంటూ భావోద్వేగ ట్వీట్‌ చేశాడు. తన గురువుతో కలిసి దిగిన పాత ఫొటోను ఈ సందర్భంగా షేర్‌ చేశాడు. ఇక వినోద్‌ కాంబ్లీ సైతం ఆచ్రేకర్‌ను గుర్తుచేసుకుని ఉద్వేగానికి గురయ్యాడు. ఈ మేరకు.. ఎవరికీ అసలు మీలాంటి మెంటార్‌ దొరకరు. కేవలం క్రికెట్‌ ఎలా ఆడాలో నేర్పడమే కాకుండా నాకు జీవిత పాఠాలు కూడా బోధించారు. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా ఆచ్రేకర్‌ సర్‌.. అని ఆయన ట్వీట్‌ చేశాడు. రమాకాంత్‌ ఆచ్రేకర్‌ కేవలం ఒకే ఒక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడినప్పటికీ తదనంతర కాలంలో గొప్ప కోచ్‌గా ఎదిగిన ఆయన గతేడాది జనవరి 2న కన్నుమూసిన విషయం విదితమే. సచిన్‌, వినోద్‌ కాంబ్లి, ప్రవీణ్‌ ఆమ్రే వంటి ఎంతో మంది క్రికెటర్లను తీర్చిదిద్దిన ఆయనను ద్రోణాచార్య అవార్డు వరించింది. ‘పద్మశ్రీ’ పురస్కారం కూడా 2010లో దక్కింది.

తనపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, స్కూటర్‌పై తనను ప్రాక్టీసుకు తీసుకువెళ్లిన ఆచ్రేకర్‌ అంటే సచిన్‌కు ఎంతో గౌరవం. ఈ క్రమంలో తనకు ఆచ్రేకర్‌తో ఉన్న అనుబంధం గురించి సచిన్‌ పలు వేదికలపై చెప్పుకొచ్చాడు. అనారోగ్యంతో ఆచ్రేకర్‌ బాధ పడుతున్న సమయంలో పలుమార్లు ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పాడు. ఇక వినోద్‌ కాంబ్లి కూడా వీలు చిక్కినప్పుడల్లా ఆచ్రేకర్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటాడు. అచ్రేకర్‌ క్రికెట్‌ అకాడమీ దాదర్‌ ప్రాంతంలోని శివాజీ పార్క్‌లో ఉండేది. క్రికెట్‌ ప్రపంచం ఎప్పటికీ ఆయన ఎంత మందికి శిక్షణనిచ్చినా ‘సచిన్‌ గురువు’గానే గుర్తు పెట్టుకుంది. తన సుదీర్ఘ కెరీర్‌లో సచిన్‌ కూడా లెక్క లేనన్ని సార్లు తన గురువును గుర్తు చేసుకునేవాడు. ఓనమాలు నేర్పిన నాటినుంచి తన చివరి టెస్టు ఆడే వరకు ప్రతీ దశలో ఆయన పాత్ర, ప్రభావం గురించి చెప్పడం టెండూల్కర్‌ ఏనాడూ మర్చిపోలేదు. క్రికెట్‌లో ఎదగాలంటే అప్పటి వరకు చదువుతున్న న్యూ ఇంగ్లీష్‌ స్కూల్‌ నుంచి శారదాశ్రమ్‌ విద్యామందిర్‌కు మారమని అచ్రేకరే తన శిష్యుడికి సూచించారు. ప్రతి ఏటా గురుపూర్ణిమ రోజున తన గురువును కలిసి ఆశీర్వచనాలు తీసుకోవడం సచిన్‌ అలవాటుగా ఉండేది.

Related posts