telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

కాంగ్రెస్ విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ ఉద్రిక్తత

తెలంగాణ కాంగ్రెస్‌ చేపట్టిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ ర్యాలీకి తనను వెళ్లనీయకుండా ఇంటి వద్దే పోలీసులు అడ్డుకోవడంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నియంతలను తరిమికొట్టిన గడ్డ తెలంగాణ అని అన్నారు. తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులపై ఆంక్షలు, నిర్బంధాలు ఇంకెన్నాళ్లంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రజానీకం ఇంకెంతో కాలం కేసీఆర్‌ చేతిలో బందీగా ఉండదన్నారు. తెలంగాణ అమరవీరుల రుణం ఎప్పటికీ తీరనిదన్నారు.

 

 

కాంగ్రెస్ పార్టీ త‌ల‌పెట్టిన విద్యార్ధి, నిరుద్యోగ జంగ్ సైర‌న్ ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ పిలుపుమేర‌కు పెద్ద ఎత్తున దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, ఎల్బీన‌గ‌ర్‌కు చేరుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీన‌గ‌ర్‌లోని కూడ‌లిలో ఉన్న శ్రీకాంత్ చారి విగ్ర‌హం వ‌ద్ద కాంగ్రెస్ కార్య‌కర్త క‌ల్యాణ్ పెట్రోల్ పోసుకొని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు విద్యార్ధిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్త‌త చోటుచేసుకున్న‌ది. పెద్ద సంఖ్య‌లో కాంగ్రెస్
పార్టీ కార్య‌క‌ర్త‌లు ఎల్బీన‌గ‌ర్ చౌర‌స్తావ‌ద్ద‌కు చేరుకోవ‌డంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది.

అధికారం ఉందికదా అని చేతిలో ఉన్న బలగాలను, కొందరు అధికారులను అడ్డంపెట్టుకొని మమ్మల్ని నిర్బంధించొచ్చు. నిజాంల పైజామ్‌లు ఊడగొట్టిన చరిత్ర ఈ గడ్డకు ఉంది. ఎంతోమందికి పాఠాలు, గుణపాఠాలు నేర్పిన చరిత్ర ఉంది. తెలంగాణ అనేది ఒక ల్యాండ్‌మైన్‌. అణు విస్ఫోటనం చెందేముందు నివురుగప్పిన నిప్పులా ఉన్న సమాజం ఇది. చైతన్యం, స్ఫూర్తి, పోరాట పటిమతో కూడుకున్నది. త్యాగాల పునాదులపై ఏర్పడిన ఈ రాష్ట్రం కేసీఆర్‌ చేతిలో బందీగా ఉండదు. ఈ బంధనాలు తెంచుకుంటాం.. ప్రగతిభవన్‌లో
బందీ అయిన తెలంగాణ తల్లికి రాష్ట్ర విద్యార్థులు, నిరుద్యోగ యువత బంధ విముక్తి కలిగిస్తుంది. అందుకు కాంగ్రెస్‌ నాయకత్వం వహిస్తుంది” అని రేవంత్‌ అన్నారు.

నిరుద్యోగ యువతపై పోలీసుల దాడికి నిరసనగా ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్‌, కేటీఆర్‌ల దిష్టిబొమ్మలు దహనం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్ని నిర్బంధాలకు పాల్పడ్డా ఎన్ని లాఠీలు ప్రయోగించినా శ్రీకాంతాచారికి నివాళులర్పించిన అందరికీ అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు.

తెలంగాణ నినాదం, నీళ్లు, నిధులు, నియామకాలు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే యువతకు ఉద్యోగాలు వస్తాయని అనేకమంది విద్యార్థులు, యువత ఉద్యమంలో పాల్గొన్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లయినప్పటికీ ఉద్యోగాలు రాలేదని అన్నారు. ఏ నినాదంతో రాష్ట్రం ఏర్పడిందో ఆ కల నెరవేరలేదని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగ జం సైరన్ చేస్తుంటే పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమని, దీన్ని ఖండిస్తున్నామని జగ్గారెడ్డి తెలిపారు.

Related posts