మాదాపూర్ లో కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్టల్ నుంచి గత రాత్రి 9 మంది విద్యార్థులు అదృశ్యం కాగా, వారిలో ఇద్దరి మృతదేహాలు ఆరాంఘర్ సమీపంలో రోడ్డుపై కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ 9 మంది మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారని తెలుస్తోంది. రాజేంద్రనగర్ లో ఉంటున్న తమ స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వీరంతా ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వెళ్లారు.
వేడుకల అనంతరం తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనం పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోగా, ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. ఇదే ప్రమాదంలో మిగతా ఏడుగురికీ గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల అదృశ్యంపై గత రాత్రే నారాయణ కళాశాల సిబ్బంది మాదాపూర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. విద్యార్థుల మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.