telugu navyamedia
తెలంగాణ వార్తలు

దేశం ప్రమాదకరస్థితిలో ఉంది.. విద్వేష రాజకీయాల్లో చిక్కి దేశం విలవిల్లాడుతోంది..

తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొన్న‌ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర‌సంగిస్తూ కేంద్ర‌ప్ర‌భుత్వం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ అనేక రకాలుగా నష్టపోయిందన్నారు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని అనేకసార్లు ప్రధానిని అడిగినా ఫలితం లేదని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయ పరమైన నిధులపై కేంద్రం కోత విధించిందని విమర్శించారు.

తెలంగాణ రైతాంగం పండించిన కొనాలని నాతో సహా  ప్రజా ప్రతినిధులంతా ఢిల్లీకి వెళ్లి ఆందోళన చేసినా.. పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని ఓ కేంద్రమంత్రి అవహేళనగా మాట్లాడారని.. ఇంతకన్నా దురహంకారం మరేమైనా ఉంటుందా? అని విరుచుకుపడ్డారు.

దేశంలో రైతులు భిక్షగాళ్ళు కాదని… దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు ఒకే విధానం ఉండాలి అని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఎవరితోనైనా పెట్టుకోండి కానీ, రైతులతో పెట్టుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, రైతులతో చెలగాటమాడే ధోరణిని ఇకనైనా మానుకోవాలని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్.

” ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ‘‘బలమైన కేంద్రం – బలహీనమైన రాష్ట్రాలు’’ అనే కుట్రపూరితమైన, పనికిమాలిన సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకొంది. అందుకే ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల హక్కుల హననం పరాకాష్టకు చేరుకుంది. కూచున్న కొమ్మను నరుక్కున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్ధికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతోంది. కేంద్రం విధించే పన్నుల నుంచి రాజ్యాంగ విహితంగా రాష్ట్రాలకు రావల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు ప్రస్తుత కేంద్రప్రభుత్వం పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి వసూలు చేస్తోంది.

రాష్ట్రాలను బలహీన పరచాలని చూస్తే సహించేది లేదన్నారు. తెలంగాణలో ఐటిఐఆర్ రాకుండా కేంద్ర అడ్డు పడిందని తెలిపారు. బయ్యారం స్టీల్, కాజీపేట పేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో తీరని అన్యాయం చేసిందని అన్నారు. నియోజకవర్గాలను డీలిమిట్ చేయాలని పునర్వ్యవస్తీకరణ చట్టంలో ఉన్నా కావాలనే కాలయాపన చేస్తోందని వ్యాఖ్యానించారు.

కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు కోరినా నయాపైసా ఇవ్వలేదని ,విభజన చట్టం హామీలన్నీ బుట్టదాఖలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందన్నారు

ఇప్పుడు దేశం ప్రమాదకరస్థితిలో ఉందని అన్నారు. విద్వేష రాజకీయాల్లో చిక్కి దేశం విలవిల్లాడుతోందని అన్నారు. దేశంలో మత పిచ్చి తప్పవేరే చర్చ లేదు. విచ్ఛిన్నకర శక్తులు ఇలాగే పేట్రేగిపోతే.. సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుందని కేసీఆర్ అన్నారు.

దేశం కోలుకోవడానికి మరో వందేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు. దేశ ప్రజలకు కావాల్సింది.. కరెంట్‌, మంచినీళ్లు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి అని అన్నారు.ప్రగతి పథంలో దేశం పరుగులు పెట్టాలంటే.. నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలి. కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎజెండా కోసం దారులు వెతకాల‌ని అన్నారు.

దేశానికి ఒక సామూహిక లక్ష్యం లేకుండా పోయింది. దేశాన్ని నడిపించడంలో వైఫల్యం ఎవరిది?. ఐదేళ్లకొకసారి జరిగే అధికార మార్పిడి ముఖ్యం కాదు.. సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి. దేశానికి నూతన గమ్యాన్నినిర్వహించాలి.. గుణాత్మక మార్పు రావాలి అని ఉద్ఘాటించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌.

Related posts