తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఇవాళ మళ్లీ హస్తినకు బయలుదేరనున్నారు. సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోనున్న కేసీఆర్… రేపు, ఎల్లుండి అక్కడే గడుపుతారు. ఇవాళ ఉదయం ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. తర్వాత జరిగే BAC సమావేశంలో అసెంబ్లీ సెషన్లో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేస్తారు. అనంతరం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు ముఖ్యమంత్రి.
రేపు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అవుతారు కేసీఆర్. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ తదితర విషయాలపై చర్చిస్తారు. ఎల్లుండి కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సమావేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షిస్తారు. ఎల్లుండి కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ కానున్నారు కేసీఆర్. ధాన్యం కొనుగోళ్లపై చర్చిస్తారు. ఆ రోజు సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.
ఈ నెల మొదటి వారంలో ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్‌షా, ఇతర కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఢిల్లీలో ఉన్న ఎనిమిది రోజుల్లో పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేయడంతో పాటు ఇతర కార్య క్రమాలతో బిజీ బిజీగా గడిపారు. జాతీయ రాజకీ యాలపై, ఆర్థిక వ్యవస్థ గురించి తనను కలిసిన వారితో చర్చించారు. వారి అభిప్రాయాలు తీసుకు న్నారు. ఇలా సీఎం ఏకంగా ఎనిమిది రోజుల పాటు ఢిల్లీలో గడపడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తాజాగా మూడు రోజుల పర్యటన చేపట్టడం కూడా చర్చకు దారితీసింది.