telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం: ప్రభుత్వ పరిధిలో మాంసం దుకాణాలు..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రాష్ట్రంలో ఉన్న మాంసం దుకాణాలన్నింటీని తన పరిధిలోకి తీసుకోబోతోంది. ప్రజలకు పరిశుభ్రమైన మాంసాన్ని అందించడం, మాంసం ధరలను నియంత్రించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తొలి నుంచి కూడా మాంసం విక్రయాలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోనే ఉంటున్నాయి. దీంతో, పలు చోట్ల నాసిరకం మాంసాన్ని వ్యాపారులు అమ్ముతున్నారు. చనిపోయిన జంతువులను కోసి కూడా విక్రయిస్తున్నారు. దీనికి తోడు ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముతూ పేదవారు మటన్ తినలేని పరిస్థితిని తీసుకొచ్చారు. వీటన్నింటికీ చెక్ పెట్టడానికి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

మాంసం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే పశుసంవర్ధక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కబేళాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి జోన్ లో రెండు కబేళాలు, ప్రతి జిల్లాలో ఒకటి లేదా రెండు కబేళాలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ కబేళాలకు స్థానిక మాంసం దుకాణాలను అనుసంధానం చేస్తారు. ఇకపై ప్రభుత్వం సరఫరా చేసే మాంసాన్నే షాపుల్లో అమ్మాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయాలు జరపాల్సి ఉంటుంది. ఫ‌లితంగా ధ‌ర‌ల‌ను నియంత్రించ‌వ‌చ్చు అన్న‌ది ప్ర‌భుత్వం ఉద్దేశం. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మటన్ మార్టులను ఏర్పాటు చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే.

 

Related posts