telugu navyamedia
తెలంగాణ వార్తలు

వైఎస్‌ఆర్ ప్రజల పక్షపాతి: అక్బరుద్దీన్ ఒవైసీ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం పాతబస్తీ అభివృద్ధిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ఏళ్ల తరబడి తమ కమ్యూనిటీ అభివృద్ధి కోసం పోరాటం చేస్తూనే ఉన్నానని అన్నారు. రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డు ఆస్తులు కబ్జాదారుల పాలవుతున్నాయని, వీటిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం స్పందించక పోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో 78 వేల ఎకరాల్లో వక్ఫ్‌బోర్డు ఆస్తులున్నాయని, వీటిలో 50 శాతానికి పైగా ఆక్రమణలకు గురైనట్లు తెలిపారు.

అసెంబ్లీ వేదికగా తాను అరుస్తూనే ఉన్నానని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నానని అన్నారు. మైనారిటీలకు న్యాయం జరగకపోవడం చాలా బాధగా ఉందని తెలిపారు. ఎన్నిరోజులు బతుకుతానో తెలీదు కానీ.. బతికున్నంత వరకు తమ కమ్యునిటీ శ్రేయస్సు కోసం కృషి చేస్తూనే ఉంటానన్నారు. మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఆరోపించారు. 400 జీవోలు జారీ చేసినా వారి అభివృద్ధి పనులకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

పాతబస్తీ వివక్షకు గురవుతోందని, హైదరాబాద్‌కు మెట్రో రైలు వచ్చినా పాతబస్తీకి రాలేదని అన్నారు. పాతబస్తీకి మెట్రో కావాలంటే ఢిల్లీ అనుమతి కావాలని.. అందరం కలిసి ఢిల్లీ వెళ్లి అనుమతి అడుగుదామన్నారు. పాతబస్తీకి బస్సులు కూడా పూర్తిగా నడవడం రావడం లేదన్నారు.

సోమవారం తెలంగాణ శాసనసభలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన వచ్చింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ తాను అభిమానించే అతి కొద్దిమంది నేతల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు అన్నారు. వైఎస్ గొప్ప మనసున్న నేత అని, ప్రజల సమస్యలను ఆయనకు నివేదిస్తే వెంటనే పరిష్కరించేవారని తెలిపారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని ప్రజల పక్షపాతి, ముస్లింల శ్రేయోభిలాషిగా అభివర్ణించారు.

వైఎస్సార్‌ను మైనార్టీ ప్రజలు తమ జీవితంలో మరచిపోరని అన్నారు. వైఎస్ లాంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదని అక్బరుద్దీన్ అన్నారు. సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగానే తక్షణం పరిష్కరించిన గొప్ప మనసున్న నాయకుడిగా అభివర్ణించారు. బాబా షరీఫుద్దీన్ పహాడీ దర్గా భూముల పరిస్థితిపై నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తాను చెబితే తన ఆవేదనను వైఎస్ అర్థం చేసుకున్నారన్నారు. ఆ తర్వాత అక్బర్ చెప్పింది సబబుగా ఉంది అంటూ ఆయన జీవో జారీ చేశారన్నారు. ఆ 85 ఎకరాల స్థలాన్ని కబ్జాలనుంచి రక్షించి, వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

Related posts