telugu navyamedia
తెలంగాణ వార్తలు

బాసర ట్రిపుల్ ఐటీలో కొన‌సాగుతున్న సాధ‌న దీక్ష‌ ..రాత్రంతా మెస్‌లో విద్యార్ధులు జాగారం

*కొన‌సాగుతున్న బాస‌ర విద్యార్ధులు ఆందోళ‌న‌
*రాత్రంతా మెస్‌లో విద్యార్ధులు జాగారం

*రాత్రి నుండి ప‌స్తులున్న‌ 3 వేల‌మంది విద్యార్ధులు 

నిర్మ‌ల్ జిల్లా లోని బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బాసర విద్యార్థుల డిమాండ్ల సాధ‌న దీక్ష‌ కొనసాగుతోంది. శనివారం రాత్రంతా ఇంజనీరింగ్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం చదివే 3 వేల మంది విద్యార్థులు మెస్‌లోనే జాగారం చేశారు.

తమ డిమాండ్లను నెరవేరుస్తామని ఇచ్చిన హామీలను పక్కనపెట్టటంతో నిన్న రాత్రి భోజనం చేయని విద్యార్థులు.. ఉదయం అల్పాహారం కూడా చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. లంచ్ కూడా చేయ‌మ‌ని విద్యార్ధులు తెలుపుతున్నారు.  తమ సమస్యలను పరిష్కరించేంతవరకు భోజనం చేయబోమని భీష్మించుకు కూర్చున్నారు..

కలుషిత ఆహారం ఘటన తర్వాత.. మూడు మెస్‌ల కాంట్రాక్టులను రద్దు చేస్తామని వైస్ ఛాన్సలర్ వెంకటరమణ హామీ ఇచ్చారని విద్యార్థులు తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించిన స్టూడెంట్ వెల్ఫేర్‌కు చెందిన సిబ్బంది త్వరలో రాజీనామా చేస్తారని పేర్కొన్నారు.ఇప్పటి వరకూ వారు రాజీనామాలు చేయలేదని ప్రశ్నించారు.

జులై 24 నాటికి మెస్‌ల కోసం కొత్త టెండర్లు పిలుస్తామని అధికారులు చెప్పినా.. ఈ విషయంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని విద్యార్థులు ప్రశ్నించారు.

మొండి పట్టుదలకు పోవద్దంటూ విద్యార్ధులకు సూచించారు ఉన్నతాధికారులు. మెస్‌ టెండర్లకు నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసినందున ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. అయితే. కొత్త మెస్‌ టెండర్లు ఖరారయ్యాకే ఆందోళన విరమిస్తామని చెబుతున్నారు.

విద్యార్ధుల ఆందోళ‌నత‌ నేప‌థ్యంలో ఇవాళ హైద‌రాబాద్‌లో పేరేంట్స్ క‌మిటీ ఏర్పాటైంది. విద్యార్ధులకు మేలు చేసేలా కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని పేరేంట్స్ క‌మిటీ తేల్చి చెప్పింది.

మ‌రోవైపు..విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఎంపీ బాపురావు వస్తారన్న సమాచారంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు.

.

Related posts