telugu navyamedia
తెలంగాణ వార్తలు

దేశంలో బీజేపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని..కేసీఆర్ సంచ‌ల‌న కామెంట్స్‌

దేశంలో బీజేపీ ప్రభావం తగ్గుతోందని, బీజేపీ ఏం చేయడం లేదని అందరికీ తెలిసిపోయిందని సీఎం కేసీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్‌లో ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై కూడా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఓట్ల కోసమే సినిమాను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కశ్మీర్‌ పండిట్‌లు తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. కశ్మీర్‌ పండిట్‌లకు జరిగిన అన్యాయాన్ని ఓట్ల రూపంలో కొల్లగొట్టేందుకే కేంద్రం ప్రయత్నం చేస్తోంద‌ని, ఇది సమంజసం కాదని మండిపడ్డారు. ప్రజలను విభజన చేసి విద్వేషాలను , ఉద్వేగాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

బీజేపీ పాలిత ప్రాంతాల్లో సెలవులు ఇచ్చి కశ్మీర్‌ ఫైల్స్‌ చూడాలని ఉద్యోగులకు చెబుతున్నారని ఇదేం పద్దతి అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదెక్కడి దిక్కుమాలిన పరిస్థితి అని మండిపడ్డారు. పలు విభాగాల్లో దేశం తిరోగమనంలో ప్రయాణిస్తోందని తెలిపారు. బీజేపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని అన్నారు.

అయితే డీమానిటైజ్‌.. లేదంటే మానిటైజ్‌.. ఇదీ బీజేపీ పరిస్థితి అని ఎద్దేవా చేశారు. 15 లక్షల ఖాళీలను కేంద్రం వెంటనే భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. గిరిజన రిజర్వేషన్లపై కేంద్రం స్పందన లేదని దుయ్యబట్టారు. బీసీ కులగణనను కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. బీజేపీ హయాంలో బ్యాంకుల దోపిడీ బాగా పెరిగిందని తెలిపారు.

తెలంగాణ ప్రజలతో కేంద్రం పెట్టుకోవద్దని హెచ్చరించారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి తప్పకుండా వస్తుందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.పరిపూర్ణ సమయంలో పరిపూర్ణమైన వేదిక సిద్దం కానుందన్నారు. 

Related posts