telugu navyamedia
తెలంగాణ వార్తలు

జగ్గారెడ్డికి కాంగ్రెస్ షాక్: అద‌న‌పు బాధ్యతల నుంచి తప్పించిన పీసీసీ

ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కాంగ్రెస్ షాకిచ్చింది. జగ్గారెడ్డికి అదనంగా ఉన్న పార్టీ బాధ్యతలను తొల‌గిస్తూ టీపీసీసీకీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు అప్పగించిన తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చిన అదనపు బాధ్యతల నుంచి టీపీసీసీ జగ్గారెడ్డిని తప్పించింది.

అంతేకాకుండా, పార్లమెంటు నియోజక వర్గాల బాధ్యతల నుంచి, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి కూడా ఆయనను తప్పించింది. జగ్గారెడ్డి ఇప్పటి వరకు నిర్వహించిన బాధ్యతలను టీపీసీసీ ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగించింది. అంజన్ కుమార్, అజారుద్దీన్, మహేష్ గౌడ్ లకు రేవంత్ రెడ్డి ఆ బాధ్యతలను అప్పగించారు.

రేవంత్‌రెడ్డికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించనప్పటి నుంచి జగ్గారెడ్డి వీలు దొరికినప్పుడల్లా రేవంత్ పై విరుచుకుపడుతుంటారు. .తాను స్వతంత్రంగా ఉంటానని, కాంగ్రెసు ఎమ్మెల్యేగా ఉండబోనని గతంలో జగ్గారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు.

దీంతో జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన టీఆర్ఎస్ లో జాయిన్ అవుతారని ఆ మధ్య ప్రచారం కూడా జరిగింది. తర్వాత ఎందుకో ఆలోచన మార్చుకున్నారు.

 నిన్న హైదరాబాద్‌ హోటల్‌ అశోకలో కాంగ్రెస్‌ విధేయుల గ్రూప్‌ పేరుతో సమావేశం నిర్వహించారు. మర్రి శశిధర్‌రెడ్డి, వి.హన్మంతరావుతో కలిసి భేటీ అయ్యారు. పీసీసీ వారించినా వినకుండా భేటీ కొనసాగించారు. తనను సస్పెన్షన్‌ చేసినా భయపడేది లేదని.. రోజుకొకరి వ్యవహారాలు బయటపెడతానంటూ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధిష్టానం టీపీసీసీకి సూచించినట్లు తెలుస్తోంది.

Related posts