telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నారాయణ, చైతన్య స్కూల్స్ నుంచే పేపర్ లీక్.. మహిళలపై దాడులకు పాల్పడింది టీడీపీ వారే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తిరుపతిలో పర్యటించారు. ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ…జగనన్న విద్యా దీవెన పథకం కింద నేడు నిధులు విడుదలవుతాయనే విషయాన్ని సహించలేని టీడీపీ నాయకులు పదో తరగతి పరీక్షల పేపర్లను లీక్ చేశారని సీఎం జగన్ విమర్శించారు.

కొద్ది రోజుల క్రితం ప్రశ్నాపత్రాలు లీకవ్వడం కూడా నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల్లోనే జరిగిందని ఆరోపించారు. ఆ నారాయణ అనే వ్యక్తి చంద్రబాబు హాయాంలోనే మంత్రిగా పని చేశారని గుర్తు చేశారు. దొంగే.. దొంగా దొంగా అన్నట్లు ఉంది టీడీపీ తీరు ఉందని ఎద్దేవా చేశారు. తమకు అనుకూలంగా ఉన్న స్కూళ్ల నుంచే ప్రశ్నాపత్రాలు వాట్సాప్‌ ద్వారా లీక్‌ చేయించి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని అన్నారు.

అత్యాచారాలు అంటూ కొత్తగా ప్రచారం మొదలుపెట్టారు. విశాఖ, విజయవాడ, గుంటూరులో ఏదో జరిగిందని నానా యాగీ చేశారని చెప్పారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలోని గ్యాంగ్ రేప్, గుంటూరు, విశాఖపట్నం అత్యాచార ఘటనల్లో నిందితులు అందరూ టీడీపీకి చెందిన వారేనని జగన్ సంచలన ఆరోపణ చేశారు. ఆ నిందితుల గురించి చంద్రబాబుకు మద్దతు పలికే మీడియా సంస్థలు రాయబోవని అన్నారు. ఆ ఘటనల్ని వక్రీకరిస్తున్నారని చెప్పారు.

మహిళల మీద నేరాలు జరగకుండా చూసేందుకు దిశ యాప్‌ను తీసుకొచ్చామని చెప్పారు. ఇన్నీ జాగ్రత్తలు తీసుకున్న కూడా దోషులు ఎవరైనా కూడా నిర్దాక్షిణ్యంగా చట్టాన్ని ప్రయోగిస్తున్నామని  చెప్పారు. వైఫల్యాలు ఉంటే పోలీసులు అయినా సరే, ప్రభుత్వ ఉద్యోగులైన సరే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు

ఇలాంటి పరిస్థితుల్లో ఎల్లో మీడియా, ఎల్లో పార్టీ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఏడు కొండల వాడిని కోరుకుంటున్నా..దుష్టచతుష్టయం నుంచి రక్షించు దేవా.. అని తిరుపతి వెంకటేశ్వర స్వామిని కోరుతున్నాను.’’ అని సీఎం జగన్ మాట్లాడారు.

గుడులు ధ్వంసం చేస్తే గుడులు కట్టామని.. విగ్రహాలు ధ్వంసం చేస్తే మళ్లీ పెట్టించామని.. రథాలు తగలబెడితే మళ్లీ నిర్మించామని.. రైతులను కుంగదీస్తే మళ్లీ నిలబెడతున్నామని చెప్పారు.మన పిల్లలను, పల్లెలను దెబ్బతీస్తే.. ఈ రోజు ప్రతి పల్లెలో ప్రజల వద్దకే సుపరిపాలన తీసుకొచ్చే విధంగా దేశానికి మార్గనిర్దేశనం చేశామని చెప్పారు. బడులను, ఆస్పత్రులను శిథిలావస్థకు తీసుకొస్తే.. నాడు-నేడు తీసుకొస్తే వాటిని నిలబెడుతున్నామని తెలిపారు. పేద పిల్లలు ఎదగకూడదని తెలుగు మీడియం ఉంచాలని చూస్తే.. వారు ఎన్ని ఆటంకాలు తెచ్చిన ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చామని చెప్పారు.

Related posts