రాజధాని మార్పు ఎందుకనేది ప్రజలకు చెప్పి చేద్దామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఈరోజు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో రాజధాని అంశంపై లోతుగా చర్చ జరిగింది. ఎన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినా అమరావతిని అభివృద్ధి చేయలేమని ఈ సందర్భంగా జగన్ మంత్రులకు వివరించినట్టు తెలుస్తోంది. అమరాతికి ఖర్చు పెట్టే లక్ష కోట్లలో 10 శాతాన్ని ఖర్చు చేసినా హైదరాబాదులా విశాఖ మారుతుందని చెప్పారు.
రాజధాని మార్పుపై ప్రజలకు స్పష్టంగా వివరిద్దామని జగన్ సమావేశంలో చెప్పారు. రాజధానిపై వచ్చే నెల 4వ తేదీన ప్రకటన చేద్దామని కేబినెట్ భేటీలో కొందరు మంత్రులు సూచించారు. హైపవర్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ప్రకటిద్దామని మరికొందరు మంత్రులు చెప్పారు. దీనికి సమాధానంగా జగన్ మాట్లాడుతూ రాజధాని తరలింపుపై తొందరేమీ లేదని స్పష్టం చేశారు.