ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కడప జిల్లాలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని రాయచోటి గిరిజన వసతి గృహంలో ఈరోజు అల్పాహారం తిన్న 60 మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లారు. అనంతరం కొద్దిసేపటికే వీరంతా అస్వస్థతకు లోనయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది వీరిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వెంటనే చికిత్స ప్రారంభించిన వైద్యులు విద్యార్థులకు వైద్యం అందించారు. ఈ విషయమై డాక్టర్లు మాట్లాడుతూ.. కలుషిత ఆహారం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం స్థిరంగా ఉందనీ, ఎలాంటి ప్రమాదం లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ఘటనపై సంబధిత అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.