చైనా ప్రతిచిన్న విషయానికి అతిగా స్పందించడం చూస్తుంటే, ఆ దేశం ఎందుకో అభద్రతా భావనలో(బహుశా దేశం అంతా వృద్దులు ఎక్కువగా ఉండటంతో, ఎవరైనా తమదేశాన్ని ఇదే అదునుగా స్వాధీనం చేసుకుంటారేమో అన్న అభద్రతా భావం ఖచ్చితంగా, సుస్పష్టంగా ఆ దేశంలో కనిపిస్తుంది. అయితే ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్న ఈ తరుణంలో, చైనాని స్వాధీనం చేసుకునే ఆలోచన ఏఒక్కరికి లేదని ఆ దేశం ఆలోచించలేకపోతుంది) ఉన్నట్టు కనిపిస్తుంది. ఎవరు చైనా సరిహద్దుల వరకు వచ్చినా వారిపై ఎక్కుపెడుతున్న ఒకే అస్త్రం అణు క్షిపణి. తాజాగా, దక్షిణ చైనా సముద్రం ఇప్పుడు ఉద్రిక్త ప్రాంతంగా మారింది. ప్రస్తుతం అక్కడి జలాల్లో అమెరికాకు చెందిన మెక్ క్యాంప్‌బెల్ క్షిపణి విధ్వంసక నౌక పహారా కాస్తోంది. జీషా దీవుల్లో ఆ నౌక సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా నౌక సంచారంతో.. చైనా అప్రమత్తమైంది. తమ దగ్గర ఉన్న ఇంటర్మీడియట్ రేంజ్ అణు సామర్థ్యం కలిగిన డీఎఫ్-26 క్షిపణి విధ్వంసక నౌకను మోహరిస్తోంది. ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అన్న సంకేతంతో తమ నౌక సంచరిస్తున్నట్లు అమెరికా వెల్లడిస్తోంది. కానీ అమెరికా వాదనలను చైనా కొట్టిపారేస్తోంది.
అమెరికా నౌకలు తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నట్లు చైనా ఆరోపిస్తున్నది. డీఎఫ్-26 షిప్ కిల్లర్ మిస్సైళ్లు సుమారు 5 వేల కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. ఈ క్షిపణులు అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలవు. అమెరికా పశ్చిమ తీర ప్రాంతమైన గువామ్ వరకు కూడా ఆ మిస్సైళ్లు వెళ్లగలవు. డీఎఫ్-26 నుంచి వదిలిన మిస్సైళ్లు మొదట్లో తక్కువ స్థాయిలో ప్రయాణిస్తాయని, అప్పుడు వాటిని రేడార్లతో పసికట్టవచ్చు అని, కానీ దూరం వెళ్లిన తర్వాత ఇక వాటిని గుర్తించలేమని చైనా అధికారులు చెబుతున్నారు. అమెరికా యుద్ధ నౌకకు వార్నింగ్ ఇచ్చేందుకు తమ యుద్ధ నౌకను సిద్ధం చేసినట్లు చైనా వెల్లడించింది. ఇలాంటి సందర్భాలు, ఆ దేశం ఎంత అభద్రతా భావంతో ఉందొ చెప్పేందుకు సరిగ్గా సరిపోతాయి.