ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి పై మరో కేసు నమోదైంది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయడు, కష్టపడి కొనుగోలు చేసుకున్న భూమిని కాజేసేందుకు ఆమె ప్రయత్నించినట్టు ఆరోపణలు వచ్చాయి. మారుతి ప్రసాద్ అనే టీచర్, 1.45 ఎకరాల భూమిని కొనుగోలు చేయగా, ఆ భూమి తమదేనంటూ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, భూమిని వదిలి వెళ్లాలంటూ తనను విజయలక్ష్మి బెదిరించారని బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
సెటిల్ మెంట్ చేసుకుందామని పిలిపించి, రూ. 11 లక్షలు వసూలు చేశారని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తండ్రి అధికారాన్నీ అడ్డు పెట్టుకుని కోడెల కుమార్తె విజయలక్ష్మి చేసిన భూ దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం గద్దె దిగిన తరువాత బాధితులు వరుసగా క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆమెపై భూ కబ్జా, బలవంతపు బెదరింపు వసూళ్లకు సంబంధించిన కేసులు నమోదుకాగా తాజాగా విజయలక్ష్మిపై మరో కేసు రిజిస్టర్ అయింది.