telugu navyamedia
తెలంగాణ వార్తలు

గృహ నిర్బంధంలోనే బండి సంజయ్‌ ‘‘నిరసన దీక్ష’’

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో సంబంధం ఉందని ఆరోపిస్తున్న బీజేపీ.. ఇవాళ తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్బంధాలకు వ్యతిరేకంగా నిరసనగా దీక్షలు చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు.

ఇందులో భాగంగానే గృహ నిర్భంధంలో ఉన్న బండి సంజయ్ కుమార్.. కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్ లో ఉన్న తన నివాసంలో ‘‘నిరసన దీక్ష’’ చేయనున్నారు. ఈ దీక్షా కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని.. విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  పార్టీ కార్యాలయంలో జరిగే నిరసన దీక్షలో అందుబాటులో ఉన్న సీనియర్ నేతలు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.

లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను పక్కదారి పట్టించేందుకే.. దిగ్విజయంగా కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నారని బండి సంజయ్‌ ఆరోపిస్తున్నారు.

27న వరంగల్‌లో బహిరంగ సభ జరిపి తీరతామని ప్రకటించారు. ఎక్కడ యాత్రను ఆపారో అక్కడే మళ్లీ ప్రారంభిస్తానని ప్రకటించారు. యాత్రను అడ్డుకుని సీఎం కేసీఆర్‌ తప్పు చేశారని వ్యాఖ్యానించారు.

బండి సంజయ్ ను అక్రమంగా నిర్బంధించారని చెబుతున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా కొనసాగిస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి విశేష ఆదరణ వస్తుండటం, బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలు సక్సెస్ కావడంతో ఓర్వలేని టీఆర్ఎస్ నేతలు పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమని బీజేపీ నేతలు చెబుతున్నారు.

మరోవైపు ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి లేదని, రెచ్చగొట్టే ప్రసంగాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, వీటితో పాటు ప్రస్తుత రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు.

అయితే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలంటూ తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంపై బీజేపీ నేతలు నేడు హైకోర్టుకు వెళ్తున్నారు. ఈ మేరకు హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. తద్వారా యాత్ర కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరనున్నారు.

Related posts