telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తాత్కాలిక ఉద్యోగులు చేసిన ప్రమాదాలకు.. ప్రభుత్వమే బాధ్యత వహించాలి .. : నాగం

Nagam janardhan reddy

సమ్మె సమయంలో విధులలోకి తీసుకున్న తాత్కాలిక ఉద్యోగులు బస్సులు నడుపుతూ చేసిన ప్రమాదాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నాగం జనార్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నాగం జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల పట్ల సీఏం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు నియంతను గుర్తుకు తెస్తుందన్నారు. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని శ్మశాన తెలంగాణగా మార్చారని సీఏం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ పాలనలో మూడు లక్షల కోట్లు అప్పులు చేశారని, వాటి ఖర్చుల వివరాలను ప్రజలకు తెలియచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రతి నియోజకవర్గానికి మూడువేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని, కాని ప్రధాన రంగాలకు చెందిన శాఖలను తన కుటుంబ సభ్యులకు అప్పగించి వాటి ద్వారా ప్రజా ధనాన్ని దోచుకున్నారని విమర్శలు గుప్పించారు. మిషన్ భగీరథ బూటకమని, ఎక్కడా కూడా ఇంతవరకు గ్రామాల్లో తాగునీరు అందలేదని, వాటిపై కార్యకర్తలతో సర్వే నిర్వహించి పోరాటాలకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు.

జిల్లా అధికార యంత్రాంగం వైఫల్యం వల్లనే జిల్లా కేంద్రంలో ఆక్రమణలు జరుగుతున్నాయని, దీనిపై అనేకమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేదన్నారు. కేసరి సముద్రం చెరువు, తుమ్మలకుంటతోపాటు వివిధ కుంటలకు చెందిన భూములు ఆక్రమణలకు గురయ్యాయని, నిబంధనలకు విరుద్ధంగా అధికారులు నాలా అనుమతులను ఇచ్చారని, అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకే ఎఫ్‌టీఎల్ పరిధిలో కూడా నిర్మాణాలకు అనుమతులను ఇచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు ఎన్ని అనుమతులు ఇచ్చారో వాటన్నింటిపై విచారణ జరిపించాలని కోరుతూ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. కేసరి సముద్రం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమాలు ఉన్నట్టు సంబంధిత అధికారి నివేదికలను ఇచ్చినా నేటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉన్న ఎమ్మెల్యేకు అవగాహన లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యతతో ఉన్న ఎమ్మెల్యే దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ వెంకట్రాములు, కాంగ్రెస్ నాయకులు అర్థంరవి, నారాయణగౌడ్, లక్ష్మయ్య, పాలమూరు యాదయ్య, రవీందర్‌గౌడ్, సలీం తదితరులు పాల్గొన్నారు.

Related posts