ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ రెండో రౌండ్‌లో ఐదుసార్లు విశ్వవిజేత, రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ లిన్ డాన్(చైనా)ను భారత బ్యాడ్మింటన్ ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ ఇంటిబాట పట్టించాడు. నేడు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 30వ ర్యాంకర్ ప్రణయ్ 21-11, 13-21, 21-7తో లిన్ డాన్‌ను చిత్తుచేశాడు. ఆద్యంతం దూకుడుగా ఆడిన ప్రణయ్ తొలి సెట్ ఆరంభం లోనే 6-2తో ఆధిక్యంలో దూసుకెళ్లాడు. ఇదే ఊపులో 21-11తో సెట్‌ను కైవసం చేసుకున్నాడు.
రెండో సెట్లో లిన్ తన అసలైన ఆటతీరు ప్రదర్శించాడు. 5-5 వద్ద ప్రణయ్‌ని నిలువరించాడు. ఆధిక్యం పెంచుకుంటూ వెళ్లి 18-13 వద్ద వరుసగా మూడు పాయింట్లు సాధించి సెట్‌ను దక్కించు కున్నాడు. నిర్ణయాత్మక మూడో సెట్‌లో ప్రణయ్ తిరుగులేని ఆట ప్రదర్శించాడు. 21-7తో సెట్‌తోపాటు మ్యాచ్‌నూ గెలుచుకు న్నాడు. తర్వాతి రౌండ్‌లో వరల్డ్ నెం.1 కెంటో మొమోటా(జపాన్)తో ప్రణయ్ తలపడతాడు. కాగా, మరో మ్యాచ్‌లో భమిడిపాటి సాయిప్రణీత్ 21-16, 21-15తో లీ డాంగ్ క్యూన్(కొరియా)పై నెగ్గగా, 14వ ర్యాంకర్ సమీర్ వర్మ 21-15, 15-21, 10-21తో ప్రపంచ 34వ ర్యాంకర్ లొహ్ ఈ కియాన్ (సింగపూర్) చేతిలో పరాజయం చవిచూశాడు.