telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ముగిసిన బీఏసీ మీటింగ్: 5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఐదు రోజుల పాటు సభను నిర్వహించాలని నిర్ణయించారు.

ఇవాళ, రేపు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నారు. శని, ఆదివారాలు అసెంబ్లీకి సెలవు, సోమవారం నుండి బుధవారం వరకు అసెంబ్లీని నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్, ఏపీ శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, టీడీపీ సభ్యులు కూడ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

టీడీపీ తరుపున అచ్చెన్నాయుడు ఈ స‌మావేశానికి హాజరయ్యారు. టీడీపీ ప్రతిపాదించిన 19 అంశాలపై చర్చకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

వ్యవసాయరంగం సంక్షోభం, రాష్ట్ర ఆర్ధిక రంగ పరిస్థితి,వర్షాలు, వరదలపై నష్టాలు , నిరుద్యోగ సమస్య, పోలవరం ప్రాజెక్టు, విభజన అంశాలపై చర్చించాలని టీడీపీ కోరింది.ఈ అంశాలపైచర్చకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

జిల్లాల విభజన అంశం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రధానంగా చర్చించనున్నారు. మరో వైపు కాసేపట్లో ప్రారంభమయ్యే సభలో జగన్ మూడు రాజధానులపై పవర్ పాయింట్ ప్రెజింటేషన్ ఇచ్చే అవకాశం ఉంది.

 

Related posts