telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతుందని ఏపీ టీడీపీ ఆరోపిస్తోంది. మైనింగ్ పరిశీలనకు వెళ్లేందుకు 10 మంది సభ్యులతో చంద్రబాబు నాయుడు టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటుచేశారు. కొండపల్లి మైనింగ్ పరిశీలనకు వెళ్తున్న టీడీపీ నేతలను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. నిజ నిర్ధారణ కమిటీ నేతలను గృహ నిర్బంధం చేశారు. కమిటీలోని పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యను విజయవాడలోని ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టడి చేశారు.

గుంటూరులో నక్కా ఆనందబాబును, విజయవాడలో బోండా ఉమను, నాగుల్ మీరాను, మచిలీపట్నంలో కొల్లు రవీంద్రను, కొనకళ్ల నారాయణను, జగ్గయ్య పేటలో నెట్టెం రఘురాంను, నందిగామలో తంగిరాల సౌమ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇంటినుంచి ఎవరినీ బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ద్విచక్ర వాహనం, ఆర్టీసీ బస్సులో టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొండపల్లి అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్తున్న టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేయడం దౌర్భాగ్యం అని వంగలపూడి అనిత మండిపడ్డారు. టీడీపీ కార్యాలయానికి వెళ్తుంటే దౌర్జన్యంగా అరెస్టు చేశారని అన్నారు. మైనింగ్‌లో తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఆడవాళ్లని కూడా చూడకుండా అక్రమ అరెస్టులు చేసి దూర ప్రాంతాలకు తరలించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షంలో ఉండి నిజాలను వెలికితీస్తుంటే వైసీపీకి ఎందుకు కోపమని దుయ్యబట్టారు.

Related posts