వరంగల్ జిల్లా వర్ధన్నపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరూరి రమేశ్ క్యాంపు కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. వరంగల్ భద్రకాళి చెరువు నుంచి హంటర్ రోడ్డు ప్రధాన రహదారికి వచ్చే వరదనీటి కాలువపై ఐదేళ్ల క్రితం ఎమ్మెల్యే దీనిని నిర్మించారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి.
ఇటీవల వరంగల్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్ నాలాలను విస్తరిస్తే ముంపు బెడద ఉండదని భావించారు. నాలాలపై చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని కేటీఆర్ ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో నాలాపై నిర్మించిన అరూరి రమేశ్ క్యాంపు కార్యాలయంపై ఇటీవల వార్తలు వెల్లువెత్తాయి. స్పందించిన ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయ కూల్చివేతకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్న పోలీసు బందోబస్తు నడుమ అధికారులు ఎమ్మెల్యే కార్యాలయాన్ని కూల్చివేశారు.