telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఉద్యోగ సంఘాలతో మంత్రులు కమిటీ చర్చలు..

చర్చల కోసం సచివాలయానికి మంత్రులు చేరుకున్నారు. మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరిపారు.

ఉద్యోగుల సమ్మె నోటీస్‌ నేపథ్యంలో సమాలోచనలు జరిపారు. చర్చలకు రాకుండా సమ్మెకు వెళితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిందిగా సీఎం జగన్ అధికారులను ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది. ఈ భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. చర్చల అనంతరం మంత్రుల కమిటీ చర్చలకు వెళ్లింది. ఉద్యోగులు సహాయ నిరాకరణ చేపడుతుండడంతో చర్చలపై ఉత్కంఠ నెలకొంది.

రేపు ఉద్యోగులు సహాయ నిరాకరణకు వెళ్తుండటంతో ఈ చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు జగన్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఉద్యోగ సంఘాలన్ని ఒకేతాటిపైకి వచ్చి పీఆర్సీ  ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నాయి. ఈ క్రమంలోనే మరికొన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకుపోయేందుకు పీఆర్సీ సాధన స్టీరింగ్ కమిటీ సిద్దమయ్యింది. శుక్రవారం సమావేశమైన స్టీరింగ్ కమిటీ సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 

వాస్తవాలు బయటపెట్టకుండా ఉద్యోగులను కించపరుస్తున్నార‌ని, చర్చల పేరిట ఉద్యోగులను అవమానపరుస్తున్నార‌ని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధమా అంటూ చర్చలకు పిలిచి చాయ్‌, బిస్కెట్‌ ఇచ్చి పంపుతున్నారు. సమ్మెలోకి వెళ్తే జీతాలు మిగుల్చుకుందామని ప్రభుత్వం కుట్ర చేస్తోంది. సమ్మె వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మొన్న చర్చలకు వెళితే అరగంటలో మాట్లాడి చెబుతామన్నారు. ఆరు గంటలైనా సమస్య పరిష్కారం చేయలేదని అన్నారు.

Related posts