telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఘనంగా ఆంధ్రరాష్ట్ర అవతరణ .. వేడుకలు..

ap map

విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో నేడు అధికారికంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలకు గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములుకు ప్రత్యేక నివాళి, మూడు రోజుల పాటు అలరించనున్న కార్యక్రమాలు. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు, స్వాతంత్ర సమరయోధుల వారుసులకు సన్మానాలూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలను మూడు రోజుల పాటు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్నారు. దీంతో పాటు స్వాతంత్య్ర పోరాటాలు, త్యాగాలు చేసిన మహానీయుల కుటుంబ సభ్యులు, బంధువులను ఘనంగా సన్మా నించనున్నారు.

రాష్ట్రానికి చెందిన స్వర్గీయ పింగళి వెంకయ్య పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు, కన్నెగంటి హనుమంతు, కోటిరెడ్డి, వావిలాల గోపాల కృష్ణయ్య, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, దామోదరం సంజీవయ్యల వారసులు బంధువులను రాష్ట్రావతరణ సందర్భంగా ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. ప్రధాన వేదికకు ఇరువైపులా చేనేత, హస్తకళల ప్రదర్శన స్టాల్స్ తో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల ఆహారపు అలవాట్లు, ప్రసిద్ధి చెందిన పంటకాలను ప్రజలకందించేందుకు 25 ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేనేత, హస్తకళలకు సంబంధించిన 21 స్టాళ్ల ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.

వివిధ ప్రాంతాలకు చెందిన చీరలు, డ్రస్ మెటీరియల్స్, రుద్రాక్షలు, పూజ సామగ్రితో కూడిన స్టాల్స్ సందర్శకులను కనువిందు చేయనున్నాయి. సంగీతం, నృత్యం, నాటకం వంటి లలిత కళా ప్రదర్శనలతో మూడు రోజుల పాటు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పుర ప్రముఖులు పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందాలని రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

Related posts