జో బైడెన్ గెలుపును దృవీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ ఈరోజు సమావేశం అయ్యింది. ఈ సమావేశం జరుగుతుండగానే ట్రంప్ మద్దతుదారులు బైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ అమెరికన్ క్యాపిటల్ భవనం వద్ద ఆందోళన నిర్వహించారు. అక్కడితో ఆగకుండా ఆందోళనకారులు క్యాపిటల్ భవనంలోకి దూసుకురావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సమయంలో ఆందోళన కారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. టియర్ గ్యాస్ ప్రయోగించారు. కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
యూఎస్ కాంగ్రెస్ కు వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆందోళన కారులు వెంటనే భవనం వదిలి వెళ్లాలని వైస్ ప్రెసిడెంట్ సూచించారు. అటు ట్రంప్ కూడా ఆందోళనకారులు సంయమనం పాటించి భవనం వీడాలని కోరుతూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం క్యాపిటల్ హౌస్ జాతీయ భద్రతా బలగాలా ఆధీనంలోకి వెళ్ళింది. దీనిపై ట్రంప్ జాతీయ మీడియాలో ప్రసంగం చేయాలని, ఆందోళన కారులను ఆందోళనను విరమించేలా చేయాలని కొత్త అధ్యక్షుడు జో బైడెన్ కోరారు. ప్రస్తుతం వాషింగ్టన్ లో కర్ఫ్యూ విధించారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.