telugu navyamedia
రాజకీయ

మనసు పూర్తిగా వికలమైంది- భగీరథ

ఆనాడు స్వాతంత్య్రం వచ్చిందని

అంబరాన్నంటిన సంబరాలు

ఈనాడు స్వేచ్చా స్వాతంత్రాలున్నా

మిన్నంటే ఆర్తనాదాలు

ఆనాడు దేశాన్ని దోచేస్తున్నారని

తెల్ల దొరలపై సమరం

ఈనాడు జాతిని విచ్ఛిన్నం చేసే

నల్ల దొరలపై చిందుతున్న రుధిరం

75 సంవత్సరాల స్వాతంత్య్రం

మధుర స్మృతుల జాడలు

కన్నీటి కాసారపు ఊటలు

ఆనాడు బ్రిటిష్ పాలన

అంతమే లక్ష్యంగా ఏకమైన జాతి

ఈనాడు స్వార్ధం ,స్వలాభం , అధికారమే

ద్యేయంగా సాగుతున్న నాయకుల అవినీతి

ఆనాడు నాయకుల్లో నీతి ,నిజాయితీ ,నిర్భీతి

మత సహనం, సామరస్యమే ఊపిరి

ఈనాడు నాయకుల్లో అనినీతి, ఆశ్రిత పక్షపాతం

కుల ,మత ,వర్గ ,ప్రాంతీయ తత్వాలే ఊపిరి

ఆనాడు నాయకులు జైళ్లలో మగ్గారు .

ఉరి కొయ్యలను ముద్దాడుతూ మృత్యువును ఆహ్వానించారు

ఈనాడు నాయకుల చిరునామా ఇంద్ర భవనాలు

అమాయక ప్రజలనేమో కష్టాల కన్నీళ్లలో ముంచు తున్నారు

నా జాతి విజయ గీతిక పాడాలని వున్నా –

మువ్వన్నెల జెండాను చూసి గర్వించాలనుకున్నా

ప్రతి నిత్యం జరుగుతున్న మారణ హోమం

నా దేశం సమైక్యంగా, నా ప్రజలు సుఖ శాంతులతో వుంటారా ?

అన్న కలవరం అగ్నిలా దహిస్తూ —

మనసు పూర్తిగా వికలమైంది , బతుకంతా శకలమైంది

అందుకే, ఈనాడు జరుగుతున్న చరిత్రకు,

చేవలేని చేతకాని

-మౌన సాక్షిని

-భగీరథ

Related posts