గులాబీ జెండాకు తామే బాసులమని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల హుజ్రాబాద్ లో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ తో ఆయన కూల్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈటల వ్యాఖ్యలపై మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు.
ఈరోజు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎర్రబెల్లి కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గులాబీ జెండాకు కేసీఆర్ ఒక్కరే బాస్ అని చెప్పారు. గులాబీ జెండాను తయారు చేసింది కేసీఆరే అని అన్నారు. ఈటల రాజేందర్ ది ముగిసిపోయిన అంశమని, ఆయన మంత్రి పదవికి కూడా ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి తాను కూడా సహకరించానని ఎర్రబెల్లి పేర్కొన్నారు.