ఆదివారం నాడు జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ప్రపంచంలో వున్న తెలుగువారినదరినీ సిగ్గుపడేలా చేశాయి. సినిమా నటీనటులు సమాజానికి ఆదర్శంగా ఉండాలి. కానీ , “మా” ఎన్నికల్లో పోటీ చేసిన సభ్యులు మాత్రం రోడ్డునపడి ఒకరిమీద మరొకరు బురద చల్లుకొని రచ్చ రచ్చ చేశారు . సినిమా స్థాయిని ఎన్నడూ లేనంతగా దిగదార్చారు .”మా “లో వున్నది 900 మంది సభ్యులు మాత్రమే. అయితే వీరి సంక్షేమం కోసం ప్రారంభమైన “మా ” ఇప్పుడు ఆధిపత్య పోరు కోసం పోరాటం చేస్తోంది . గత కొన్నాళ్లుగా “మా ” ఎన్నికల్లో అనారోగ్యకరమైన పోటీ మొదలైంది. ఈ సంవత్సరం అది హద్దులు దాటిపోయి వ్యక్తిగత దూషణలకు దారితీసింది.
ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు రెండు ప్యానళ్లు పోటీకి దిగాయి. మొదట ప్రకాష్ రాజ్ “మా”ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత మంచు విష్ణు తాను కూడా “మా “అధ్యక్ష ఎన్నికల బరిలో వున్నానని మీడియాకు చెప్పారు .”మా ” సభ్యులకు అనేక సంక్షేమ పధకాలు , “మా ” కు ఒక మంచి భవనం నిర్మిస్తానని ప్రకాష్ రాజ్ తన ప్రణాలికను మొదట చిరంజీవికి చెప్పారు. అది ఆయనకు నచ్చడంతో తన మద్దతు ప్రకటించారు. చిరంజీవి తరుపున నాగబాబు ప్రకాష్ రాజ్ నే గెలిపించమని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఎప్పుడైతే మంచు విష్ణు తాను పోటీ చేస్తున్నాని ప్రకటించారో అప్పుడు చిరంజీవి మోహన్ బాబుకు ఫోన్ చేసి “ఈసారి ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు అవకాశం ఇద్దాము . విష్ణును పోటీకి పెట్టవద్దు , ప్రకాష్ రాజ్ తరువాత విష్ణుకు అవకాశం ఇద్దాము ” అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు . ఇందుకు మోహన్ బాబు ఒప్పుకోలేదు . కారణం చిరంజీవి ఆధిపత్యాన్ని మోహన్ బాబు అంగీకరించకపోవడమే.
ప్రకాష్ రాజ్ కు ఎలాగూ మద్దతు ఇస్తున్నట్టు చిరంజీవి హామీ ఇచ్చారు. కాబట్టి తన తరుపున నాగబాబును రంగంలోకి దించారు. మోహన్ బాబు ఎన్నిల్లో విష్ణు గెలుపు కోసం స్వయంగా రంగంలోకి దిగారు . ఇక్కడ నుంచి “మా ” ఎన్నికలు క్రమంగా వేడెక్కడం మొదలు పెట్టాయి ఆరోపణలు , ప్రత్యారోపణలు , ప్రలోభాలు , బెదిరింపుల పర్వం మొదలైంది . . మోహన్ బాబు తన కుమారుడు విష్ణు గెలుపు కోసం అన్ని రకాల అస్త్రాణాలు బయటకు తీశాడు. తన కుమారుడే భారీ మెజార్టీతో గెలుస్తాడని మోహన్ బాబు ముందే ప్రకటించారు.
ఇక చిరంజీవి కూడా నాగబాబు ముందు ప్రకాష్ రాజ్ గెలుపుకోసం పరోక్షంగా కృషి చేశారు . ఎన్నికల రోజున ప్రకాష్ రాజ్ గన్ మన్ ను పోలింగు కేంద్రం లోకి అనుమతించలేదు . ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారు మాత్రమే లోపల ఉండాలనే నిబంధన పెట్టారు . ఓటు వెయ్యడానికి వచ్చే సభ్యులు లోపలకు వచ్చి క్యూ లో వుండాలని , ఓటు వేసిన తరువాత బయటకు వెళ్లిపోవాలని చెప్పారు. మోహన్ బాబు మాత్రం ఉదయం తన మనుషులతో లోపలకు వచ్చారు. రాత్రి 11. 00 గంటల వరకు లోపలే ఉండి మొత్తం ఎన్నికల ప్రక్రియను నడిపిస్తూ సభ్యులను ప్రభావిత చేస్తూ, బెదిరిస్టుతో, చెప్పరాని బూతులు తిట్టారని ఎన్నికల్లో పోటీచేసిన కొందరు సభ్యులు మంగళవారం రోజు కన్నీరు పెట్టుకొని మరీ మీడియాకు చెప్పారు.
ఎన్నికల ప్రక్రియను మోహన్ బాబు శాసించారని కూడా ఆరోపించారు .అలాగే “మా ” అధ్యక్షుడు నరేష్ కూడా కొంతమంది సభ్యులను బండ బూతులు తిట్టి మీ సంగతి చూస్తానని హెచ్చరించారని తెలిపారు . నరేష్ అధ్యక్షుడు గా శకుని పాత్ర నిర్వహించారని కొంతమంది వ్యాఖ్యానించారు. ఇక ఈ ఎన్నికల్లో మోహన్ బాబు ఎందుకిలా చేశారు ? విష్ణు గెలుపే లక్ష్యంగా తన సర్వ శక్తులు వడ్డదానికి కారణమేమిటి ” మోహన్ బాబుకు రాజకీయ ఎజెండా ఉందా ? లేక మరేదైనా మనసులో పెట్టుకున్నారా ? అందుకే ఇలా ప్రవర్తించరా ? దర్శకుడు దాసరి నారాయణ రావు మరణం తరువాత అందరూ రంజీవిని సినిమారంగానికి పెద్ద దిక్కుగా భావిస్తున్నారు.
కరోనా సమయంలో పేద కళాకారులు , సాంకేతిక నిపుణులు , సినిమా జర్నలిస్టులకు నిత్యావసర సరుపులను చిరంజీవి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు . అలాగే సినిమా సమస్యలను చర్చించాలంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె .చంద్రశేఖర్ రావు , వై .ఎస్ జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని ఆహ్వానిస్తున్నారు . ఇవ్వన్నీ మోహన్ బాబు లో వున్న ఆధిపత్యానికి ఆజ్యం పోశాయా ? అందుకే “మా ” ఎన్నికల్లో తన సత్తాను చిరంజీవికి , సినిమా రంగానికి మోహన్ బాబు చూపించాలనుకున్నారా ? మోహన్ బాబు ప్రవర్తించిన తీరును ఇప్పుడు “మా “కు పోటీ చేసిన సభ్యులు మీడియా ముందు వివరించారు . మోహన్ బాబును దోషిగా చూపించి అక్రమాలకు కేంద్ర బిందువు మోహన్ బాబు అని వేలెత్తి చూపించారు . ఆదివారం ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గ్రూప్ లో గెలిచిన వారంతా రాజీనామా చేశారు.
దీనికి ముందు నాగబాబు , ప్రకాష్ రాజ్ “మా ” సభ్యత్వానికి రాజీనామా చేశారు . విష్ణు ఎన్నికల్లో ప్రకటించినవన్నీ అమలు చెయ్యాలని , అలా చెయ్యకపోతే తాము ఊరుకోమని హెచ్చరించారు.ఇలాంటి తిరుగుబాటు , అనూహ్య పరిణామం మోహన్ బాబు ఊహించనిది . ఇప్పడు “మా “లో రెండు గ్రూపులు . ఒకటి చిరంజీవిది . మరొకటి మోహన్ బాబుది . ఈ తీరు ,తిరుగుబాటు పై మోహన్ బాబు ఎలా స్పందిస్తారో ? విష్ణు “మా ” అధ్యక్షుడుగా ఎలా రియాక్ట్ అవుతారో ? ఎలాటి నిర్ణయం తీసుకుంటారో ? తరువాత కథ ను “మా ” తెర మీద చూద్దాము .
పవన్ పేరును వాడుకుని సినిమాలను ప్రమోట్ చేసుకునే స్థాయికి నేను దిగజారలేదు… : అడివిశేష్