జాతిపిత మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరామ్ గాడ్సేని దేశభక్తుడుగా అభివర్ణిస్తూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. దీనిపై ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమెకు కొత్తేం కాదన్నారు.
గాంధీకి ప్రజ్ఞా ఠాకూర్ శత్రువని, ఆయనను హత్యచేసిన వారికి మద్దతుదారని ఆమె వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుందన్నారు. నేను ఈ విషయంపై ఇప్పటికే స్పీకర్ కు ప్రివిలైజ్ మోషన్ ఇచ్చానని తెలిపారు. ఈ విషయంపై లోక్ సభలో రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ నాథూరామ్ గాడ్సేని ఎవరైనా దేశ భక్తుడిగా పేర్కొంటే, తమ పార్టీ తప్పక ఖండిస్తుందని చెప్పారు. మహాత్మాగాంధీ తమకు మార్గ దర్శకుడని స్పష్టం చేశారు. ప్రజ్ఞా ఠాకూర్ ఈ వ్యాఖ్య చేయడం దురదృష్టకరమని అన్నారు.