నటుడు మోహన్ బాబు తనకు చంద్రబాబుతో 40 ఏళ్ళ పరిచయం ఉందని, అతని రక్తంలో అణువణువునా అబద్ధాలు, కుట్రలు నిండిపోయాయని విమర్శించారు. ఈ ఉదయం మంగళగిరికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. “తెలుగుదేశం ఎవరిది? నంబర్ వన్ హీరోగా ఉన్నటువంటి ఎన్టీ రామారావుగారు, ఆయన కుమారుడు హరికృష్ణతో కలిసి ట్రావెల్ చేస్తూ, తినీతినక, నిద్రాహారాలు మాని, తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి, భారతదేశంలో శభాష్ అనిపించుకున్నారు. ఆ మహానుభావుడు, ఇతని పాదాల పడి కన్యాదానం చేస్తే, ఆ మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ది గ్రేట్ చంద్రబాబునాయుడు. అంతకంటే ఘోరం ఇంకోటి ఉంటుందా?” అని మోహన్ బాబు మండిపడ్డారు.
చంద్రబాబు ఆనాడు పార్టీలో లక్ష్మీ పార్వతి ప్రమేయాన్ని తగ్గించేందుకు, ఎన్టీఆర్ నుంచి పదవిని తీసుకుని, తిరిగి ఒకటి రెండు రోజుల్లో ఆయనకే అధికారాన్ని ఇద్దామని తనకు చెప్పాడని అన్నారు. అన్న ఎన్టీఆర్ పై చెప్పులు వేయించడం వాస్తవమని, భగవంతుని సాక్షిగా కళ్లారా తాను చూశానని మోహన్ బాబు చెప్పారు. అది చంద్రబాబు నైజం. ఆ తరువాత కూడా తాను చంద్రబాబును గెలిపించాలని ప్రచారం చేశానని, ఆపై తనను కరివేపాకులా తీసి పక్కన పడేశారని ఆరోపించారు. ఇప్పుడున్నది ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం కాదని, లాక్కున్న తెలుగుదేశం పార్టీ అని ఆరోపించారు.
ఇది ప్రజలకు ఎవరు చెప్పినా ఎక్కడం లేదని, ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేయడంతో పాటు ఆయన కుటుంబాన్ని వాడుకుని పక్కన బెట్టారని, కోట్లాది మంది అభిమానులున్న జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ అలాగే జరిగిందని ఆరోపించారు. ఈమధ్య కూడా తనకు కూతురితో సమానమైన హరికృష్ణ కుమార్తె సుహాసిని విషయంలోనూ చంద్రబాబు మోసం చేశారని అన్నారు. రాజధానిని ఏదైనా బీడు భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కట్టివుంటే ఎంతో మేలు జరిగుండేదని, కానీ, పచ్చని పొలాల్లో ముందే బినామీల ద్వారా కొనుగోలు చేయించి, అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసి రైతులను మోసం చేశారని మోహన్ బాబు ఆరోపించారు. నిత్యమూ జగన్ ను దొంగ, దొంగ అని ఆరోపించడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుపై 11 కేసులు ఉన్నాయని, వాటిల్లో విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకుని తిరుగుతున్నారని నిప్పులు చెరిగారు. ఎవరిని మోసం చేసి చంద్రబాబు ఇంత ఆస్తి సంపాదించారని మోహన్ బాబు ప్రశ్నించారు.