telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీ స్థానంలో రోహిత్ ఉంటే గెలిచేవాడా…?

kohli interviewed rohith sharma viral

ఐపీఎల్ 2020 సీజన్‌ టైటిల్‌ను రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఐదో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. దాంతో రోహిత్ శర్మ కెప్టెన్సీపై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసల జల్లు కురిపించింది. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలను హిట్‌మ్యాన్‌కు ఇవ్వాలని కూడా కొందరు డిమాండ్ చేశారు. భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అయితే రోహిత్‌కు సారథ్య బాధ్యతలు ఇవ్వకపోతే దేశానికే నష్టమని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. సారథిగా విరాట్ కోహ్లీ అసమర్థుడని, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వెంటనే అతని కెప్టెన్సీపై వేటు వేయాలని కూడా సూచించాడు. అయితే ఈ వ్యాఖ్యలను టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నా ఈ ఫలితమే ఉండేదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

ఆర్‌సీబీ వైఫల్యాలకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఏ మాత్రం కారణం కాదన్నాడు. ‘టీమిండియా టీ20 ఫార్మాట్‌ సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించకపోతే దేశానికి నష్టం జరుగుతుందని గంభీర్ అంటున్నాడు. ఎందుకంటే రోహిత్ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ అని చెబుతున్నాడు. అయితే గంభీర్‌ను ఒకటి అడగాలనుకుంటున్నా. ఇదే ఆర్‌సీబీ టీమ్‌ కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు ఇస్తే.. ఇంతే సక్సెస్ సాధిస్తాడా? ఈ ఐదు టైటిళ్లలో ఒక్కటైనా గెలుస్తాడా? రోహిత్ అద్భుతమైన కెప్టెన్. అతనంటే నాకు ఇష్టమే. కానీ ముంబై ఇండియన్స్ సక్సెస్ స్టోరీని భారత జట్టుతో పోల్చడం ఏంటనేది నా ప్రశ్న. కోహ్లీ జట్టు విఫలమైతే.. అది అతని తప్పిదమా?”అని చోప్రా సూటిగా ప్రశ్నించాడు. విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలన్న గంభీర్ డిమాండ్‌ను టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తప్పుబట్టాడు. ‘కోహ్లీ కెప్టెన్సీపై వేటు వేయాల్సిన అవసరం లేదు. అతను జట్టుకు సారథి మాత్రమే. ఆర్సీబీ వైఫల్యానికి అతనొక్కడే కారణం కాదు. ఆర్‌సీబీ పూర్తిస్థాయి జట్టుతో ఏనాడు సిద్ధం కాలేదు. టీమిండియాకు కూడా కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. మరి అక్కడ ఫలితాలు సాధిస్తున్నాడు కదా.? వన్డేలు, టీ20లు, టెస్టులు ఇలా అన్నింటిలోనే కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు మెరుగైన విజయాలు నమోదు చేసింది.’అని సెహ్వాగ్ గుర్తు చేశాడు.

Related posts