సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైనట్టు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. గాల్వన్ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మౌనం వీడాలని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించి అత్యంత ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ఈ ఘటనను బట్టి సరిహద్దులో పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు.
చైనా సైనికుల దాడిలో భారత సైనికులు అమరులయ్యారంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. చైనాకు దీటైన సమాధానం చెప్పాల్సిన సమయం ఇదేనని పేర్కొన్నారు. సరిహద్దు సమస్యలపై కేంద్రం తన వైఖరేంటో దేశ ప్రజలకు చెప్పాలని మాజీ ప్రధాని దేవెగౌడ డిమాండ్ చేశారు.