పీఎం కిసాన్ పథకం నగదు సాయాన్ని ఈ నెల నుంచే ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన్ మం త్రి కిసాన్ సమ్మాన్ యోజన (పీఎం కిసాన్) కింద ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6 వేలు ఇస్తామని ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ పథకం కింద ఆర్థిక సాయం అందాలంటే ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రైతులు తమ గుర్తింపు కార్డు కింద ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
తొలి విడత నగదు పొందేందుకు ఆధార్‌కు బదులుగా డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డు, కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. రెండో విడత నుంచి నగదు పొందాలంటే ఆధార్ నంబర్ ఉండాల్సిందే. దీనికి సంబంధించి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సోమవారం లేఖ రాసింది.పీఎం కిసాన్‌కు అర్హుల జాబితాను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఫిబ్రవరి 1 నాటికి భూరికార్డుల్లో పేర్లు నమోదైన యజమానులే ఈ పథకానికి అర్హులని స్పష్టం చేసింది.