ఏపీలో ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో భాగంగంగా పోటాపోటీగా రోడ్డు షోలు, బహిరంగ సభలు, బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారు. బహిరంగ సభలను విజయవంతం చేసేందుకు ఆయా పార్టీలు భారీగా జనసమీకరణ చేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు చోరీలకు యత్నిస్తున్నారు.అందినంత దోచుకుని పరారవుతున్నారు. అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో ఉన్నసమయంలో ఏకంగా వైసీపీ చీఫ్ జగన్ సోదరి షర్మిల చేతి ఉంగారాన్నే కొట్టేసేందుకు ఓ దొంగ ప్రయత్నించాడు.
శనివారం షర్మిల మంగళగిరి నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. రోడ్డు పక్కన కిక్కిరిసిన వైసీపీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ, చేతులు కలుపుతూ ముందుకు సాగారు. ఆమెతో చేతులు కలిపేందుకు కార్యకర్తలు పోటీ పడ్డారు. దీంతో షర్మిల కూడా కొంత ఉత్సాహంగా వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉత్సాహం నింపారు. ఇదే అదునుగా భావించిన ఓ వ్యక్తి షర్మిలకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఆమె వేలికి ఉన్న ఉంగరాన్ని కొట్టేసేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన షర్మిల చేయిని గట్టిగా వదిలించుకున్నారు.