telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

సింహాచలం భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం

సింహాచలం, మాన్సాస్‌ భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. నోడల్‌ అధికారిగా దేవాదాయశాఖ కమిషనర్‌ను నియమించింది. 3 నెలల్లోగా నివేదిక అంచాలని ఆదేశించింది. సింహాచలం భూములను రిజిస్ట్రీ నుంచి తొలగించడం, మాన్సాస్ ట్రస్టు భూముల విక్రయంపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఇప్పటికే ప్రాథమిక నివేదికను సమర్పించిన దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీ సింహాచలం ఆలయ ప్రాపర్టీ రిజిస్ట్రార్‌లో 860 ఎకరాల భూములు గల్లంతైనట్టు అంచనా వేస్తోంది. మాన్సాస్‌ భూముల అమ్మకాల్లో రూ. 74 కోట్లు నష్టం వాటిల్లినట్లు కమిటీ తేల్చింది. ఇప్పటికే అడిషనల్‌ కమిషనర్‌ రామచంద్రమోహన్‌, డిప్యూటీ ఈవో సుజాత ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. అప్పటి దేవస్థానం ఈవో, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ అవకతవకలకు కారణమని ప్రాథమికంగా తేలటంతో సస్పెన్షన్ వేటు వేసినట్టు పేర్కొంది.

దేవాదాయశాఖలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు రామచంద్రమోహన్ పై చర్యలు తీసుకున్నట్టు ప్రభత్వం వెల్లడించింది. ఈ అవకతవకల్లో మరింత మంది పాత్ర బయటపడే అవకాశమున్నందున లోతుగా దర్యాప్తు చేసేందుకు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. మూడు నెలల్లోగా విచారణ నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. ఈ అవకతవకలకు సంబంధించి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి సమాచారం ఇచ్చేందుకు దేవాదాయశాఖ కమిషనర్ నోడల్ అధికారిగా ఉంటారని పేర్కొంది. ప్రత్యేకించి మాన్సాస్ ట్రస్టులో పెద్ద మొత్తంలో భూముల అవకతవకలు జరగటంతో నేరుగా విజిలెన్స్ ఎన్ ఫోర్సుమెంట్ విభాగం ముందస్తు సమాచారంతో తనిఖీలు చేయొచ్చని స్పష్టం చేసింది.. ఈ మేరకు దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

Related posts