telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

60 ఏళ్లు దాటిన తరం గొప్పనా..ఇప్పటి తరం గొప్పనా..!

అరవై దాటిన మేము ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము. లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము.

పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న సామాజిక -ఆర్థిక పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు. ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది… అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది.

పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే. పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము. దాదాపు అందరం దుంపల బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మాలో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే!

ఆ రోజుల్లో చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు. ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే.

మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. మూడు అణాలు ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో. అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ … ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.

మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట ఏడుపెంకులాట బుచ్చలాట రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం ఈ నాటికీ దాదాపు అందరం 48-65సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే!

అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకొని పిలుస్తున్న వాళ్ళమే. ఇక మాకన్నా అదృష్టవంతు లెవరుంటారు?
ఆహా! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ!! అచ్చంగా మన బాల్యాన్నిమనమే రాసుకున్నట్టుగానే వుంది!!!.

Related posts