telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ .. నేటి నుండే ..

2019 world cup captains photo shoot

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఆరంభోత్సవం నేడే. అందరి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది ఆతిథ్య ఇంగ్లాండ్‌. అద్భుతమైన ఆటగాళ్లుండి ప్రతిసారీ దురదృష్టం పాలయ్యే దక్షిణాఫ్రికాతో దానికి తొలి సమరం. రెండూ పటిష్ఠమైన జట్లే. తొలి మ్యాచే ఉత్కంఠ రేపేలా కనిపిస్తోంది. ఇక ‘కింగ్‌ కోహ్లీ’ ప్రపంచకప్‌ గెలిచి తన కీర్తి కిరీటంలో ‘కోహినూర్‌’ వజ్రాన్ని పొదగాలనుకుంటున్నాడు. అభిమానులూ అదే కోరుకుంటున్నారు. రాబోయే ఆరున్నర వారాలు క్రికెట్‌ పండగ జరగనుంది. 10 దేశాలు మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడతాయి. ఐదు మ్యాచ్‌లు గెలిస్తే సెమీస్‌ బెర్త్‌ ఖరారు అవుతుంది. అందుకే ఆ ఐదు విజయాలే అన్ని జట్లకు ప్రథమ లక్ష్యం. ఇంగ్లాండ్‌, భారత్‌, ఆస్ట్రేలియా ఫేవరెట్‌ పందెం కోళ్లు. న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా అండర్‌డాగ్స్‌. పాకిస్థాన్‌, వెస్టిండీస్‌ ప్రమాదకర జట్లు. కప్‌ ఎగరేసుకు పోయినా ఆశ్చర్యం లేదు. బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ ప్రపంచ క్రికెట్లో తమ ప్రభను ఎలుగెత్తి చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. బ్యాటింగ్‌కు స్వర్గధామాలైన ఇంగ్లాండ్‌ పిచ్‌లపై విజేతలను నిర్ణయించేంది బౌలర్లే.

బ్యాటర్లకు అనుకూలించే పిచ్‌లపై జస్ప్రీత్‌ బుమ్రా, మణికట్టు ద్వయం యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ టీమిండియా బౌలింగ్‌ దాడిలో కీలకం కానున్నారు. బ్యాటింగ్‌ లైనప్‌ను విరాట్‌, రోహిత్‌, శిఖర్‌ ముందుండి నడిపించనున్నారు. మొన్నటి వరకు మిడిలార్డర్‌పై దిగులుండేది. బంగ్లాపై కేఎల్‌ రాహుల్‌, ఎంఎస్ ధోనీ శతకాలతో ఆ బెంగ తీరినట్టే కనిపిస్తోంది! ఇక స్టీవ్‌స్మిత్, డేవిడ్‌ వార్నర్‌ పునరాగమనంతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా ప్రమాదకరంగా మారింది. ఐపీఎల్‌లో వార్నర్‌ 692 పరుగులతో అదరగొట్టాడు. స్టీవ్‌స్మిత్‌ వార్మప్‌ మ్యాచుల్లో శతక బాదేశాడు. ఉస్మాన్‌ ఖవాజా, ఆరోన్‌ ఫించ్‌, పేసర్లు కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, స్పిన్నర్లు నేథన్‌ లైయన్‌, ఆడమ్‌ జంపా స్థిరంగా ఆడుతన్నారు.

ఇంగ్లాండ్‌ ఈసారైనా ఖచ్చితంగా ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యంలోని ఇంగ్లిష్‌ జట్టు మునుపెన్నడూ ఇంత ప్రమాదకరంగా, స్థిరంగా లేద. జేసన్‌ రాయ్‌, జోస్‌ బట్లర్‌, జానీ బెయిర్‌స్టో, జో రూట్‌ విధ్వంసకరంగా ఆడుతున్నారు. యువ జోఫ్రా ఆర్చర్‌ తాజాగా అమ్ముల పొదిలో చేరాడు. బౌలర్లు మార్క్‌వుడ్‌, ఆదిల్‌ రషీద్‌, మొయిన్‌ అలీ, బెన్‌స్టోక్స్‌ సహా అంతా ఫామ్‌లోనే ఉన్నారు. ప్రదర్శన బాగా లేకున్నా మహ్మద్‌ ఆమిర్‌, వాహబ్‌ రియాజ్‌ తమ అనుభవంతో మళ్లీ పాక్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫకర్‌ జమాన్‌, ఇమామ్‌ ఉల్‌ హఖ్‌, మహ్మద్ హఫీజ్‌, బాబర్‌ ఆజామ్‌, హ్యారీస్‌ సొహైల్‌ ఎంత ప్రతిభావంతులో తెలిసిన సంగతే. న్యూజిలాండ్‌ బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లతో సమతూకంగా ఉంది. కేన్‌ విలియమ్సన్‌ పరిణతి చెందిన సారథి. సీనియర్లు మార్టిన్‌ గప్తిల్‌, కొలిన్‌ మన్రో మ్యాచ్‌లను మలుపు తిప్పే సమర్థులు. సీమింగ్‌ పరిస్థితుల్లో ట్రెంట్‌ బౌల్ట్‌ అత్యంత ప్రమాదకారి. ఆల్‌రౌండర్లు కొలిన్‌ గ్రాండ్‌హోమ్‌, జిమ్మీ నీషమ్‌ నిలకడగా రాణిస్తే కివీస్‌ సెమీస్‌ చేరడం సులువే. ‘యూనివర్స్‌ బాస్’ క్రిస్‌గేల్‌, ప్రమాదకారి ఆండ్రీ రసెల్‌ విండీస్‌ను విజేతగా నిలబెట్టాలని పట్టుదలతో ఉన్నారు. ఆ జట్టులో అంతా ఆల్‌రౌండర్లే అన్నట్టుగా ఉంటారు.

దక్షిణాఫ్రికా ఈసారైనా చోకర్స్‌ పేరు పోగొట్టుకోవాలని ఎదరుచూస్తోంది. డుప్లెసిస్‌ రూపంలో సఫారీలకు మంచి సారథి ఉన్నాడు. డేల్‌ స్టెయిన్‌ను గాయాల బెడద వేధిస్తోంది. రబాడా 150 కి.మీ. వేగంతో చురకత్తుల్లాంటి బంతులతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టగలగడం సానుకూల అంశం. ఇమ్రాన్‌ తాహిర్‌, ఆమ్లా, మిల్లర్‌, డికాక్‌ కీలకం కానున్నారు. ప్రపంచ క్రికెట్‌లో వేగంగా ఎదుగుతున్న అఫ్గాన్‌ తనదైన రోజున ఏ జట్టునైనా ఓడించగలదు. మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ సంగతి తెలిసిందే. మహ్మద్‌ షెజాద్‌, హజ్రతుల్లా జజాయ్‌, హష్మతుల్లా షాహిది, మహ్మద్‌ నబీ రాణిస్తే ఆ జట్టుతో ఆట కష్టమే! బంగ్లాదేశ్‌ కనీసం సెమీస్‌ చేరాలని అభిమానుల ఆశ. బంగ్లా పసికూన పేరు తొలగించుకొని చాలా ఏళ్లైంది. మష్రఫె మొర్తజా అనుభవం ఉన్న సారథి. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అతడికి అండగా ఉన్నాడు. తమీమ్‌ ఇక్బాల్‌, మహ్మదుల్లా రియాద్‌, ముష్ఫికర్‌ రహీమ్‌ అంతర్జాతీయ వేదికపై తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. శ్రీలంక మాత్రమే ఎందులోనూ డెప్త్‌ లేకుండా కనిపిస్తోంది. లసిత్‌ మలింగ మాత్రమే అనుభవజ్ఞుడు. దిముతు కరుణ రత్నెకు సారథ్యం కొత్త. అర్జున రణతుంగ, మహేళ జయవర్దెనె, కుమార సంగక్కర వంటి దిగ్గజాల లోటు తీర్చేవారు ఆ జట్టులో కనిపించడం లేదు.

Related posts