telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఈవీఎం ల గురించిన .. అసలు విషయాలు ఇవే..

dvivedi on poling percentage and evm rumours

తాజాగా జరిగిన మొదటి విడత ఎన్నికలలో ఈవీఎం లు మొరాయించిన విషయం తెలిసిందే. అయితే అది ఎంతమేరకు నిజం అన్నది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారేమో 381 చోట్ల ఈవీఎంల్లో సమస్యలు వచ్చాయంటారు. భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనరేమో 45 ఈవీఎంల్లోనే సమస్య తలెత్తింది అని చెబుతారు. క్షేత్రస్థాయిలో చూస్తే వందలు కాదు. రాష్ట్రంలో వేల కొద్దీ ఈవీఎంలు పోలింగ్‌ రోజున మొరాయించాయి. వివిధ కేంద్రాల్లో కనిష్ఠంగా 45 నిమిషాలు నుంచి గరిష్ఠంగా 7 గంటల వరకూ ఈవీఎంలు పనిచేయలేదు. దీని తో అర్ధరాత్రి దాటి వేకువజాము వరకూ పోలింగ్‌ నిర్వహించవలసి వచ్చింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ సమయంగా ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 6 గంటల లోపు క్యూలైన్లో ఎంత మంది ఉంటే, వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈవీఎంల మొరాయింపు లేకుండా పోలింగ్‌ సక్రమంగా జరిగి ఉంటే, సాయంత్రం 7-8 గంటల్లోగా పోలింగ్‌ పూర్తి కావాలి. కానీ, అర్ధరాత్రి దాటి మరుసటి రోజు వేకువజాము వరకూ కూడా పోలింగ్‌ నిర్వహించారంటే.. ఈవీఎంల వైఫల్యం కాకుండా వేరే సమస్య ఇంకేముంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది.

పోలింగ్‌ రోజున క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పడు 4,583 చోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్లు, కంట్రోల్‌ యూనిట్లు మొరాయించినట్లు తేలింది. ఈ మూడు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి పనిచేయకపోయినా ఓట్లు వేయటం సాధ్యం కాదు. దీని తో ఆ కేంద్రాల్లో పోలింగ్‌కు గంటలు తరబడి అంతరాయం ఏర్పడిందని అర్ధమవుతుంది. కొన్ని చోట్లయితే పోలింగ్‌ మొదలుకావటమే ఆలస్యమైంది. ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా, పదుల చోట్ల మాత్రమే ఈవీఎంల్లో సమస్యలు తలెత్తాయని చెబుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఒక్క కృష్ణా జిల్లాలోనే పోలింగ్‌ రోజున దాదాపు 211 ఈవీఎంలను అధికారులు మార్చారు. మొరాయించటం, సాంకేతిక సమస్యలు కారణంగా వీటిని మార్చారు. 180 కంట్రోల్‌ యూనిట్లు, 241 వీవీప్యాట్‌లను కూడా మార్చాల్సి వచ్చింది. అనంతపురం జిల్లాలో 40, విశాఖ జిల్లాలో 114, శ్రీకాకుళం జిల్లాలో 252, కడప జిల్లాలో 40 ఈవీఎంలు మార్చారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే తరహా సమస్యలు తలెత్తాయి. 618 పోలింగ్‌ కేంద్రాల్లో 2 గంటలు ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్‌ ప్రారంభమైన తర్వాత కూడా పలు చోట్ల సాయంత్రం వరకూ ఈవీఎంలు సతాయించాయి.

Related posts